బావ కోసం రంగంలోకి మహేష్
PBN - October 23, 2020 / 11:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న నావ లాంటిదని, దిగేవాళ్ళు ఇప్పుడే దిగేసి ప్రాణాలు కాపాడుకోండని కొందరు చెపుతున్న మాట. నిజానికి ఏపీలో టీడీపీ పరిస్థితి మరి అంత దారుణంగా లేకపోయినా కానీ, కొన్ని ఇబ్బందులు మాత్రం వున్నాయి. ఇదే పార్టీలో కొనసాగితే భవిష్యత్తు కష్టమని అనేక మంది నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు వున్నారు. అందులో గల్లా ఫ్యామిలీ ఒకటి. మొన్ననే గల్లా అరుణ కుమారి పార్టీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసింది. ఆ సమయంలో అరుణ కుమారి ఆమె కొడుకు గల్లా జయదేవ్ ఇద్దరు కూడా బీజేపీ లేదా వైసీపీలో చేరిపోతారని వార్తలు గుప్పుమన్నాయి.
ఈ సమయంలోనే గల్లా అరుణ కుమారికి టీడీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవి, గల్లా జయదేవ్ కు మరోసారి పొలిట్ బ్యూరో పదవి ఇచ్చాడు బాబు. అయితే ఇవన్నీ కేవలం తాత్కాలికమే అనే గుసగుసలు వినవస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీకి అధికారం దక్కుతుందనే నమ్మకం అయితే లేదు. అప్పటిదాకా పార్టీలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న గల్లా ఫ్యామిలీ పక్క పార్టీల వైపు చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. బీజేపీ లోకి వెళ్లాలని అనుకున్నారు కానీ, రాష్ట్రంలో ఆ పార్టీ బలంగా లేకపోవటంతో ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ లోకి వెళ్లాలంటే అనుకున్న స్థాయి అటు నుండి సానుకూలతలు కనిపించటం లేదు.
దీనితో గల్లా జయదేవ్ బావమరిది సినీ హీరో మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నట్లు గుసగుసలు. సూపర్ స్టార్ ఫ్యామిలీ మొదటి నుండి కాంగ్రెస్ కు అనుకూలం. వైఎస్సార్ కు, కృష్ణ కు మంచి అనుబంధం వుంది. ఆ తర్వాత జగన్ కు కూడా కృష్ణ మరియు మహేష్ మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం. ఆ చనువుతో ఇప్పుడు మహేష్ తన బావ గల్లా జయదేవ్ విషయం గురించి సీఎం జగన్ తో మాట్లాడి ఆయన్ని వైసీపీ కి దగ్గర చేసే ఆలోచనతో మహేష్ బాబు ఉన్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. నిజానికి మహేష్ బాబు రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉండే మనిషి, సినీ రంగంలోనే తనవాళ్లకు ఎలాంటి సిఫారస్సులు చేయటానికి ఇష్టపడని మహేష్ బాబు, గల్లా జయదేవ్ విషయంలో అంత పెద్ద సాహసం చేస్తాడా..? అనే అనుమానం అందరిలో ఉంది. అయితే మహేష్ బాబును దగ్గర చూసినవాళ్లు మాత్రం ఇది ఒట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని, ఇలాంటి విషయాల్లో మహేష్ అసలు కలగజేసుకోడని చెపుతున్నారు.