KTR: బండి సంజయ్ తప్ప.. అందరూ మంచోళ్లే..

KTR నోటి దురుసుతనానికి కేరాఫ్ అడ్రస్ బండి సంజయ్ అని మీరు భావిస్తున్నారా?. అతనికి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మరొకటి తెలియదని అనుకుంటున్నారా?. ఎందుకంటే రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ తప్ప మిగతావాళ్లంతా మంచోళ్లే అని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ని తాగుబోతు అని తిట్టడం పట్ల కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని మంత్రి ఖండించారు. అయితే కేటీఆర్ అభిప్రాయంతో బీజేపీ నాయకులు కూడా ఏకీభవించటం గమనార్హం. ఈ ఘటన మొన్నీమధ్య సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన ప్రగతి భవన్ లో జరిగింది.

లింగోజిగూడ.. రగడ..

హైదరాబాద్ లోని లింగోజిగూడ మున్సిపల్ డివిజన్ ఉపఎన్నిక వ్యవహారం తెలంగాణ బీజేపీలో సరికొత్త వివాదానికి దారితీసింది. ఢిల్లీలోని అధిష్టానం అనుమతి గానీ రాష్ట్ర నాయకత్వం పర్మిషన్ గానీ తీసుకోకుండా కొందరు కమల నాథులు కేటీఆర్ ని కలవటం, ఏకగ్రీవం పై ప్రకటన చేయించటం పట్ల హైకమాండ్ సీరియస్ అయింది. అసలు బాధ్యులెవరో గుర్తించి చర్యలు తీసుకునే అధికారాన్ని బండి సంజయ్ కి అప్పగించింది. దీంతో ఆయన నిజనిర్ధారణ కమిటీని వేశారు. అది రెండు రోజుల్లో నివేదిక ఇస్తుంది. నివేదిక వచ్చాక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ లోపు బాధ్యుల నుంచి కూడా వివరణ కోరారు. వాళ్లేం చెబుతారో చూడాలి.

కేటీఆర్ కి మద్దతేంటి?..

మంత్రి కేటీఆర్ బండి సంజయ్ ని తప్పుపడుతుంటే బీజేపీ నేతలు ఆయనకు సపోర్ట్ చేయటం కాషాయం పార్టీలోని కొందరికి విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు. సీఎం కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడొద్దంటూ తాము బండి సంజయ్ ని కంట్రోల్ చేస్తూనే ఉన్నామని, అయినా ఆయన వినట్లేదని, అందుకే ఆర్ఎఎస్ఎస్ కి సైతం ఫిర్యాదు చేశామని ఒక లీడర్ కేటీఆర్ కి వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. కాగా.. కేటీఆర్ తో భేటీ అయినవాళ్లలో తాజా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు కూడా ఉండటం గమనార్హం. ఒక వేళ తన మీద బీజేపీ చర్యలు తీసుకుంటే ఆయన టీఆర్ఎస్ లోకి జంప్ చేయటానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే బండి సంజయ్ కి చెప్పాపెట్టకుండా కేటీఆర్ దగ్గరికి వెళ్లారని తెలుస్తోంది.

Advertisement