KTR: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన కేటీఆర్‌.. పోలీసులని పిలిచి స‌న్మానించిన మంత్రి

KTR: ఈ మ‌ధ్య పోలీసులు విధిగా త‌మ ప‌నులు నిర్వ‌ర్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌శంస‌లు పొందుతున్నారు. తాజాగా రాంగ్‌రూట్‌లో వస్తున్న మంత్రి కేటీఆర్‌ కారును ట్రాఫిక్‌ ఎస్‌ఐ అడ్డుకున్నారు. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా శనివారం బాపూఘాట్‌ వద్ద నివాళులర్పించేందుకు కేటీఆర్‌ వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది.

ఎస్‌ఐ అడ్డుకున్న సమయంలో కారులో మంత్రి లేరు. ఘాట్‌ వద్ద బాపూజీకి నివాళులర్పించేందుకు గవర్నర్‌ తమిళిసై, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా వచ్చారు. వారికి కేటీఆర్‌ వీడ్కోలు పలుకుతుండగా మంత్రి వెళతారు, కారు తీసుకురావాలంటూ డ్రైవర్‌కు పార్టీ నేతలు చెప్పారు. ఇద్దరు గవర్నర్లు అక్కడి నుంచి వెళుతుండటంతో ఓ వైపు రహదారిలో రాకపోకలను నిలిపివేశారు. దీంతో రాంగ్‌రూట్‌లో మంత్రి కారు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్య ఆపి.. బానెట్‌ మీద బాదారు.

రాంగ్ రూట్‌లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం.. చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి తన కార్యాలయానికి పిలిపించి సన్మానించారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సమక్షంలో ఆ ఇద్దరినీ కేటీఆర్ శాలువా కప్పి సత్కారించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లవేళలా ముందుంటానని.. చలాన్‌ విధించిన రోజు వాహనంలో తాను లేనని మంత్రి పేర్కొన్నారు.

గతంలో తెలుపు రంగు ఫార్చ్యూనర్‌ను కేటీఆర్‌ వినియోగించే వారు. వెన్నునొప్పి బాధిస్తుండటంతో కొన్నాళ్లుగా గ్రే కలర్‌ ఇన్నోవా కారు వాడుతున్నట్లు తెలిసింది. మంత్రి కారని గుర్తించకపోవడం వల్లే ఎస్‌ఐ ఆపారని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్‌ఐని కొందరు నెటిజన్లు అభినందించారు