KCR : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. గులాబీ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న సమయంలో బీజేపీ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. దీనిబట్టి తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటోందని స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు కూడా బీజేపీ బలం పెరగడానికి కారణాలయ్యాయి.
బీజేపీ వ్యూహం ఏంటి?

కరీంనగర్లో బండి సంజయ్ అరెస్టు, ధాన్యం కొనుగోళ్లు, ఇటీవల చోటుచేసుకున్న అత్యాచారాలపై పోలీసుల వైఖరిపై బీజేపీ నిలదీతలు కమలం పార్టీ ఛరిష్మాను తెలియజేశాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పని అయిపోయిందంటూ బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టేశారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సహా బీజేపీ అగ్రనేతలంతా హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే భాగంగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.
ఈ సభకు దాదాపు 10 లక్షల మందిని సమీకరించాలని తెలంగాణ కమలనాథులు శ్రమిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభ ద్వారానే వచ్చే ఎన్నికలకు శంఖారావం పూరించనుంది బీజేపీ.ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోదీ సభ నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లకు అవకాశం లేకుండా టీఆర్ఎస్ గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ.. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కనిపించేలా టీఆర్ఎస్ వ్యుహాలు రచించింది. నగరంలో టీఆర్ఎస్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండేలా ప్లాన్ చేసింది. అంతేకాకుండా మెట్రో పిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలిపేలా ప్రకటనలతో నింపేయనుంది. హోర్డింగ్స్‌లో కేసీఆర్ ఫొటో ఉండేలా.. రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్, కల్యాణలక్ష్మి, రైతు భీమా తదితర పథకాలను ప్రచారం చేయనుంది.
ఇందుకోసం.. ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రోజులతో పాటు.. అందుకు ముందు, వెనకాల రెండు రోజుల్లో(మొత్తం వారం రోజులు) తమ ప్రకటనల కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని తెలుస్తోంది. మరోవైపు నగరంలోని బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పక్కా వ్యుహాంతో బీజేపీ నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించకుండా టీఆర్ఎస్ పెద్ద ఎత్తున స్కెచ్ వేసిందని అంటున్నారు.