Kathi karthika: కత్తి కార్తిక.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అచ్చమైన తెలంగాణలో మాట్లాడుతూ ధమ్ ధమ్ చేసే కార్తీక లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రీనీచ్ లో మాస్టర్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, లండన్ లోనే ఆర్కిటెక్ గా రెండు సంవత్సరాలు పనిచేసింది. కార్తీక తొలుత రేడియో జాకీ గా పని చేసింది, తరువాత వి6 ఛానల్ లో వ్యాఖ్యాతగా చేరి మంచి పేరు సంపాదించుకుంది.

తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మైక్ టీవిలో చేరి ముచ్చట విత్ కార్తీక అనే కార్యక్రమం చేసింది. 2017లో హైదరాబాదులోని బంజారా హిల్స్ లో బి స్టూడియోస్ పేరుతో సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోను ప్రారంభించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక టివి ఛానల్ లో చేరి తనదైన శైలిలో రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూలు చేసింది. 2019లో టీమ్ టీవి పేరిట యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది.
కత్తి కార్తీక టీఆర్ఎస్ కీలక నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు చాలా దగ్గరి బంధువు. కార్తీక పద్మారావుకు వరుసకు మనవరాలు అవుతారు. తనకు తన తాత పద్మారావు గౌడ్ ఆదర్శమని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే.. గత రెండేళ్లుగా కత్తి కార్తీక తన రాజకీయ భవిష్యత్తు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున అభ్యర్థిత్వం దక్కించుకున్నారు.
అయితే ఎన్నికలలో ఆమెకు డిపాజిట్స్ కూడా దక్కలేదు. గ్రేటర్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరనున్నట్టుగా కూడా తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కార్తీక కలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్‌లో కూడా కత్తి కార్తీకకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా కార్తీకతో పార్టీలో చేరాల్సిందిగా సంప్రదింపులు జరిపారు.

మరోసారి ప్రజా క్షేత్రంలోకి రావాలని కత్తి కార్తిక చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఏదైన రాజకీయ పార్టీ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్తికకు బీజేపీ, కాంగ్రెస్‌లో నాయకులతో మంచి సంబంధాలు ఉండటంతో ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక నుండి తిరిగి పోటి చేసి పరువు నిలబెట్టుకోవాలని ఈ యాంకరమ్మ భావిస్తున్నట్టు సమాచారం.