CM Jagan:కరోనా కష్ట కాలంలో జగన్ వింత నిర్ణయాలు.. అవసరమా ఇప్పుడు..?
PBN - May 3, 2021 / 11:10 AM IST
CM Jagan ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కరోనా తీవ్ర రూపం దాల్చుతుంటే రాష్ట్ర సర్కార్ దాని మీద కంటే కూడా తమకు రాజకీయంగా ఉపయోగపడే వాటిమీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కరోనా మహమ్మారి వలన వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతుంటే దానికి తగ్గ నష్ట నివారణలు చర్యలు తీసుకోవాల్సింది పోయి, మరిన్ని కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
దేశంలోనే పేరున్న సంస్థ అమరరాజా సంస్థకు నోటీసులు ఇవ్వటమే కాకుండా ఆ సంస్థను మూసివేయాలని చెపుతూ విద్యుత్ సరఫరాను ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నిలిపివేయించింది. దీనితో ఈ సంస్థ శాశ్వతంగా మూతపడుతుందేమో అని అందులో పనిచేస్తున్న వేల సంఖ్యలోని కార్మికులు వారి కుటుంబాలు ఆందోళన చెందాయి.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలోని ఎర్రగుంట్ల సమీపంలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీకి కూడా నాలుగు రోజుల క్రితం ఇలాగే చేశారు. అమరరాజా కానీ జువారీ సంస్థలు కానీ బాగా వెనుకబడిన రాయలసీమలోనే ఉన్నాయి. జువారీ పరిశ్రమ ద్వారా ప్రత్యేకంగా 1000 మంది పరోక్షంగా 2000 మంది ఆధారపడి ఉన్నారు. అమరరాజా పరిశ్రమ మీద ప్రత్యేకంగా 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా 50 మంది ఆధారపడి జీవిస్తున్నారు.
అసలే కరోనా భయంతో అల్లాడిపోతున్న ఇలాంటి సమయంలో ఈ విధంగా పరిశ్రమలు మూసివేయాల్సిందే అంటూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించటం మూలంగా అనేక కుటుంబాలు ఆందోళన చెందుతాయనేది వాస్తవం. నిబంధలను కొంచం అతిక్రమించిన కానీ ఎంతటి పరిశ్రమలైన మూసివేయాలని చెపుతున్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతుంది కదా..? ఇంత వరకు ఎన్ని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొనివచ్చారు. ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అని అడిగితే సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉందా..? అనేది చూసుకోవాలి.
ఎలాంటి రాజకీయ దురుద్దేశ్యానికి తావులేకుండా నిజంగా నిబంధలను అతిక్రమించిన పరిశ్రమలపై చర్యలు తీసుకోవటాన్ని ఎవరు తప్పు పట్టరు. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు ఏమిటో, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గమనించి నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో అందులో పనిచేస్తు జీవిస్తున్న వేల కుటుంబాల గురించి ఆలోచించాలి.