దుబ్బాక ఓటమితో కాంగ్రెస్ లో పెద్ద తలకాయ చిక్కుల్లో పడబోతుందా..?
PBN - November 11, 2020 / 08:53 AM IST

తెలంగాణలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన దుబ్బాక ఉప ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. బీజేపీ నుండి పోటీచేసిన రఘునందన్ రావు తెరాస పార్టీ మీద 1400 పైచిలుకు ఓట్లు మెజారిటీ సాధించాడు. దీనితో అధికార తెరాస పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కేవలం తమ సంప్రదాయక ఓట్లు నిలబెట్టుకుంటూ 21 వేలు పై చిలుక ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యింది. దుబ్బాకలో తెరాస వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరగాల్సిన పోరు కాస్త తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్లు జరగటం కాంగ్రెస్ కు పెద్ద మైనస్.
ఇక ఈ ఓటమితో కాంగ్రెస్ పార్టీలో అనేక సంచలనాలు జరగబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఈ ఫలితలు శాపంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పటి నుండో పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చూస్తుంది. అయితే పార్టీలోని సీనియర్ నేతల ఒకే మాట మీద లేకపోవటం, కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇవ్వటం నచ్చని కొందరు నేతలు అడ్డుపుల్ల వేయటం వలన సాధ్యపడలేదు. ఇదే సమయంలో పార్టీలోని కొందరు నేతలు ఉత్తమ్ కుమార్ కు అనుకూలంగా మాట్లాడుతూ పీసీసీ పదవి చేజారిపోకుండా చూస్తున్నారు.
కానీ ఉత్తమ్ కుమార్ వలన పార్టీకి ఒనగూరిన లాభం ఏమి లేదు. 2018 ఎన్నికలల్లో ఘోరమైన ఓటమి చవిచూసింది. ఆ తర్వాత పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే లను కాపాడుకోలేకపోయింది. హుజార్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికలో ఘోరమైన ఓటమి చవిచూసింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కునరిల్లిపోతుంది కూడా ఉత్తమ్ కుమార్ నాయకత్వంలోనే, కాబట్టి కచ్చితంగా పీసీసీ పదవి నుండి ఉత్తమ్ కుమార్ ను తప్పించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. అయితే పార్టీలోని కొందరు నేతలు లాబీయింగ్ చేసి దుబ్బాక ఎన్నికల దాక పీసీసీ పదవిలో మార్పు చేయకండి అంటూ పార్టీ హై కమాండ్ దగ్గర డిమాండ్ చేయటంతో ఉత్తమ్ కుమార్ పీసీసీ అధ్యక్ష హోదాలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు.
ఆయనుకు బాగా తెలుసు ఈ ఎన్నికల మీద తన అధ్యక్ష పదవి ఆధారపడి ఉందని, అదే సమయంలో ఉత్తమ్ కు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ నేతలు కూడా దుబ్బాకలో ఉత్తమ్ కుమార్ తో కలిసి పనిచేసారు కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ ఓటమిలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పూర్తి భాద్యుడిని చేయటం కూడా భావ్యం కాదు కానీ,, దాని ప్రభావం ఎక్కువగా పడేది ఆయన మీదే… దుబ్బాక ఎన్నికల ప్రభావం మూలంగా ఉత్తమ్ కుమార్ పదవిలో మార్పు రావచ్చని కొందరు నేతలు గట్టిగానే చెప్పుకుంటున్నారు.