మహా దారుణం.. ఓట్లు కోసం శ్రీవారి లడ్డులు పంపిణీ.. బయకొస్తున్న నిజాలు
PBN - February 20, 2021 / 09:15 AM IST

పంచాయితీ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎక్కువ చోట్ల విజయాలు సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో అధికార వైసీపీ పార్టీ మితిమీరి వ్యవహరిస్తుందా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఎక్కువ మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఏకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరూపంగా భావించే లడ్డులను ఓట్ల స్లిప్స్ తో సహా పంచటం ఇప్పుడు తీవ్ర చర్చనీయంశం అయ్యింది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తొండవాడ పంచాయతీలో అధికార పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు.అదే సమయంలో ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేస్తూ.. శ్రీవారి ప్రసాదాలను ఓ సంచిలో పెట్టి అందించారు. ఎస్సీకాలనీల్లో ఐదు, ఇతర కాలనీల్లో పదేసి చొప్పున లడ్డూలు, అభ్యర్థి గుర్తుతో ముద్రించిన కరపత్రాలను సంచుల్లో పెట్టి పంపిణీ చేశారు.కొన్ని వీధుల్లో తెల్లవారుజామున 3.30 గంటల నుంచే పంచారు.
తిరుచానూరు సహా కొన్ని గ్రామాల్లో చిన్న లడ్డూలు, కల్యాణం లడ్డూలు, వడలు కూడా ఓటర్లకు అందుతున్నాయి.తిరుమల కొండపైనే సామాన్య భక్తులకు లడ్డూల కొరత ఉంటే.. చంద్రగిరి, పాకాల మండలాల్లోకి ఇన్ని లడ్డూలు ఎలా వస్తున్నాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాకాల, మొగరాల, ఉప్పరపల్లితోపాటు చంద్రగిరి, తొండవాడ, తిరుచానూరు, ముంగిలిపట్టుల్లో ఓటర్ల ఇళ్లకు పదుల సంఖ్యలో లడ్డూలు అందాయి.
తితిదే ఇటీవల ఒక్కో భక్తుడికి ఒక్క లడ్డూ మాత్రమే ఉచితంగా ఇస్తూ.. ఆపై ఒక్కో లడ్డూకు రూ.50 చొప్పున వసూలు చేస్తుంది. ఈ అదనపు ప్రసాదంపై నిర్దిష్టంగా పరిమితి విధించకపోయినా.. వందల కొద్ది కొనుగోలు చేసే వీల్లేదు. 22 వేల మంది ఓటర్లున్న తిరుచానూరు గ్రామంలో సగం కుటుంబాలకు పెద్ద లడ్డూ, వడ అందినట్లు సమాచారం.
ఇక్కడ 11 వేల పెద్ద లడ్డూలు, అదే సంఖ్యలో వడలు అందించాలంటే.. తితిదే యంత్రాంగం సహకారం లేకుండా సాధ్యం కాదని, దీని వెనుకాల ఎవరున్నారన్నది తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లడ్డూలపై పరిమితి లేకపోయినా.. వడలు మాత్రం కౌంటర్ వద్ద ఒక్కో భక్తుడికి రెండు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఇన్నేసి వడలు ఎలా వచ్చాయి? అధికార పార్టీకి చెందిన నేతలు చెబితే ఇచ్చారా? వంటి పలు సందేహాలు తలెత్తుతున్నాయి.