Eknath Shinde : మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాజకీయ సంక్షోభం క్షణానికో మలుపు తీసుకుంటోంది. శివసేనకు చెందిన కీలక నేత ఏక్‌నాథ్ షిండే పార్టీకి చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడంతో సీఎం ఉద్ధవ్ థాకరే సర్కారు మైనారిటీలో పడిపోయిన సంగతి తెలిసిందే.
మహా సంక్షోభం..
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించిన గంటల వ్యవధిలోనే సీఎం నివాసాన్ని వీడారు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే. బుధవారం రాత్రి తన సామాగ్రితోపాటు ఉద్ధవ్ థాక్రే, ఆయన సతీమణి, కుమారుడు ఆదిత్య థాక్రే కూడా తిరిగి తమ నివాసం మాతోశ్రీకి తరలివెళ్లారు.
భారీగా చేరుకున్న శివసేన కార్యకర్తలు, నేతలు ఉద్దవ్ థాక్రేకు మద్దుతగా నినాదాలు చేశారు. ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే అనుచరులకు అభివాదం చేస్తూ అక్కడ్నుంచి కదిలారు. ఇది ఇలావుండగా, శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే క్యాంపునకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడం గమనార్హం. దీంతో షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య 40కిపైగా ఉన్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. తనకు కరోనా పాజిటివ్ ఉన్నా లక్షణాలు లేవని, దేశంలోని టాప్-5 సీఎంలలో తానూ ఒకడినని, ప్రజల మద్దతుతోనే తాను సీఎం అయ్యానని ఆయన చెప్పారు. సీఎం పదవిని నిజాయితీగా నిర్వర్తించానని చెప్పారు. శివసేన ఎప్పటికీ హిందుత్వానికి కట్టుబడి ఉంటుందని, హిందూ మతం-శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయని ఉద్ధవ్ స్పష్టం చేశారు.
- Advertisement -
సీఎం పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని, తన రాజీనామా లేఖను మా ఎమ్మెల్యేలెవరైనా గవర్నర్‌కు ఇవ్వొచ్చని ఉద్ధవ్ చెప్పడం గమనార్హం. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని, తన తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తానని చెప్పారు. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉందని, శివసేనను మోసం చేయమని చెప్తూ.. చేస్తున్నదేంటని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ బుధవారం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. అంతేగాక, తిరుగుబాటు శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయమని సలహా ఇచ్చారని రాజకీయ వర్గాలు తెలిపాయి. పవార్‌తో పాటు ఆయన కుమార్తె, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ మంత్రి జితేంద్ర అవద్‌తో కలిసి దాదాపు గంటపాటు సమావేశం జరిగింది.