Eatala Vs Kcr : ‘ఈటల’ విషయంలో కేసీఆర్ సర్కారును నిలదీసిన తెలంగాణ హైకోర్టు

Eatala Vs Kcr: ఈటల రాజేందర్ కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ పై ఇవాళ మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. కేసీఆర్ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆఫీసర్లు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని, సర్వే చేసే ముందు తమకు కనీసం నోటీసులు కూడా జారీచేయలేదని, కలెక్టర్ నివేదికను సైతం ఇవ్వలేదని ఈటల ఫిర్యాదు చేయగా న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ సీరియస్ గా స్పందించారు. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా?. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తవుతుంది?. ఫిర్యాదు వచ్చినంత మాత్రాన ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా?. అధికారుల హడావుడి, అత్యుత్సాహం చూస్తుంటే వాళ్లు ఫీల్డులోకి అడుగు కూడా పెట్టలేదని, కారులోనే కూర్చొని రిపోర్ట్ ని తయారు చేసినట్లు కనిపిస్తోందే అంటూ జడ్జి నిలదీశారు.

Eatala Vs Kcr

అందుకే ఇలా చేశాం..

న్యాయమూర్తి ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ సమాధానాలు చెప్పారు. ఈటల రాజేందర్ పై తీవ్రమైన ఆరోపణలు, పెద్దఎత్తున కంప్లైంట్లు వచ్చాయి కాబట్టే తక్షణం దర్యాప్తు జరిపించామని, ఇది పూర్తి స్థాయి విచారణ కాదని, ప్రాథమిక విచారణ మాత్రమేనని స్పష్టం చేశారు. నిందితులపై తదుపరి చర్యలు చట్టప్రకారమే ఉంటాయని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు. పిటిషనర్లది ఆందోళన మాత్రమేనని వివరణ ఇచ్చారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈరోజు మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేశారు.

Eatala Vs Kcr

జడ్జి ఇంట్లోనే విచారణ

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో హైకోర్టులో విచారణలన్నీ ఆన్ లైన్ లోనే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల కుటుంబం నిన్న సోమవారం రాత్రే దాఖలు చేసిన ఈ అత్యవసర పిటిషన్ పై న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ ఇవాళ తన ఇంట్లోనే విచారణ చేపట్టారు. ఈటల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఈటల వర్సెస్ కేసీఆర్ రేంజ్ లో నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వాధికారులను ఇలాంటి సూటి ప్రశ్నలు అడగటం ఆసక్తి కలిగిస్తోంది.

Advertisement