Eatala: ఈటల ఇంకా చేరనేలేదు.. తెలంగాణ బీజేపీలో అప్పుడే అసంతృప్తి..

Eatala: ప్రస్తుతానికి టీఆర్ఎస్ లోనే ఉన్న ఈటల రాజేందర్ ఈ నెల 31న బీజేపీలో చేరటం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కమలం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఈ నెల 31న కాకపోతే జూన్ 1వ తేదీన లేదా 2వ తేదీ కాషాయం పార్టీలో జాయిన్ అవటం తథ్యమని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఇంకా ఆ పార్టీలోకి అడుగుపెట్టనేలేదు. అప్పుడే తెలంగాణ బీజేపీలో అసంతృప్తి మొదలైంది. దీనికి ఆ పార్టీ స్టేట్ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఆజ్యం పోశారు.

Eatala Rajender

నాకు మాట వరసకైనా చెప్పరా?..

సిద్ధాంతాల పునాదుల పైన నిర్మించిన బీజేపీ ఈటల రాజేందర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటోందంటూ పెద్దిరెడ్డి తప్పుపట్టారు. రాష్ట్ర పార్టీ పెద్దలు ఎందుకింత హడావిడిగా, మూడో కంటోడికి కూడా తెలియకుండా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన నిన్న గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను హుజూరాబాద్ లోకల్ లీడర్ ని. గతంలో శాసన సభ్యుడిగా, మంత్రిగా పని చేశా. ఈటలను పార్టీలోకి తీసుకునే విషయాన్ని నాకు ఎవరూ మాటమాత్రంగానైనా చెప్పలేదు. ఇన్నాళ్లూ ఆయనపై రాజకీయ పోరాటం చేస్తున్న స్థానిక నేతల ఫీలింగ్స్ పట్టించుకోలేదు’’ అంటూ పెద్దిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు.

Eatala Rajender

తొలగించిన వ్యక్తిని ఎలా తీసుకుంటారు?..

భూకబ్జా ఆరోపణలు వచ్చాయనే కారణంతో మంత్రివర్గం నుంచి తొలగించిన వ్యక్తిని బీజేపీలోకి తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈటల ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉండగా, ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందా లేదా అనేది స్పష్టం కాకముందే పార్టీలో చేర్చుకోవటానికి ఇంత ఆరాటపడటం సరికాదని హితవు పలికారు. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక బీజేపీలోకి వస్తానంటే అప్పుడు ఆలోచించాల్సిందిపోయి ఏమాత్రం ఓపిక లేకుండా రాత్రికి రాత్రే ద్వారాలు తెరవటం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. ఢిల్లీ నుంచి ఒక లీడర్ ప్రత్యేక విమానంలో వచ్చి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ రిసార్టులో మీటింగ్ పెట్టారనే వార్తల పట్ల కూడా విస్మయం వెలిబుచ్చారు. ఈటల బీజేపీలోకి వస్తే మీరు టీఆర్ఎస్ లో వెళతారా అన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే అలాంటి ప్రయత్నాలేమీ జరగట్లేదని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Eatala Rajender