CM Jagan 2019 ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి బండ మెజారిటీ కట్టబెట్టారు. ఇంత మెజారిటీ ఉన్నకాని టీడీపీ పార్టీలో గెలిచిన కొందరు ఎమ్మెల్యే లను వైసీపీ లోకి ఆహ్వానించారు. ఇప్పుడు అదే వైసీపీ పార్టీకి సీఎం జగన్ కు తలనొప్పిగా మారినట్లు సృష్టంగా తెలుస్తుంది. టీడీపీ నుండి ఎమ్మెల్యే లను తీసుకున్న మూలంగా టీడీపీకి కలిగిన నష్టం పెద్దగా లేకపోయిన కానీ ఆ చర్యల వలన ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ లో తీవ్ర అసంతృప్తులు చెలరేగుతున్నాయి.
గన్నవరం గరం గరం
గతంలో ఎప్పుడు వివాదాల విషయంలో పెద్దగా బయటకు రాని గన్నవరం ఇప్పుడు నిత్యం వార్తల్లో కనిపిస్తుంది. టీడీపీ తరుపున గెలిచినా వల్లభనేని వంశీని వైసీపీ పార్టీలోకి తీసుకోవటంతో ఆ పార్టీ నేత దుట్టా రామచంద్రరావుకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గు మంటోంది. అలాగే వంశీపై 2014 ఎన్నికల్లో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు పడడడం లేదు. ఇటీవల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కనీసం గ్రామాల్లోకి కూడా వంశీని రాకుండా యార్లగడ్డ అనుచరులు అడ్డుకున్నారు. పార్టీ పెద్దలు ఏదో ఆశిస్తే.. క్షేత్రస్థాయిలో మాత్రం మూడు వర్గాలు తయారయ్యాయి. అధిష్ఠానం ఆశీస్సులు ఉండటంతో వంశీ దూకుడుగా ఉన్నారు. కానీ, అదే రేంజ్లో ఒకవైపు యార్లగడ్డ.. మరోవైపు దుట్టాలు సవాళ్లు ప్రతిసవాళ్లతో గన్నవరం రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
చీరాలలో మరింత వేడి
ఇక ప్రకాశం జిల్లా చీరాలలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర స్థాయి విభేదాలకు కారణం అవుతుంది. టీడీపీ తరుపున గెలిచిన కరణం బలరాం కృష్ణమూర్తి అధికారికంగా వైసీపీ లో చేరకపోయిన కానీ, కొడుకు వెంకటేష్ ను చేర్పించి వెనుక నుండి అన్ని నడిపిస్తున్నాడు., స్థానిక వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ కు కరణం వర్గానికి ఒక్క నిమిషం కూడా పడటం లేదు. సందర్భం వస్తే పరోక్ష వ్యాఖ్యలతో నాయకులు వేడి పుట్టిస్తున్నారు. వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో రెండు వర్గాలు బాహా బాహీకి దిగడం పార్టీ వర్గాలను కలవర పర్చింది. ఇక, కరణం పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కూడా రాత్రి వేళలో నిర్వహించిన ర్యాలీ కూడా కరణం.. ఆమంచి వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మత్స్యకారుల మధ్య వివాదాలను కూడా ఈ ఇద్దరు రాజకీయంగా వాడుకుని రోడ్డెక్కారు.
ఈ పరిణామాలు గమనిస్తే పార్టీలోని నేతల గొడవల వలన రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు, ఈ రెండు చోట్ల ఆయా నేతలను సర్దుకొని పోవాలని సీఎం జగన్ చెప్పిన కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావటం లేదు. మరి మున్ముందు ఈ వివాదాలు ఎటు వైపు దారి తీస్తాయో చూడాలి