మోడీ మెడకు చుట్టుకున్న ట్రంప్ నోటి దురుసు
PBN - October 25, 2020 / 07:37 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్, తన ప్రచారంలో నోటి దురుసుకు మరోసారి పదును పెట్టాడు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ట్రంప్, బైడెన్ మధ్య మూడో సారి జరిగిన ముఖాముఖి ప్రచారంలో భాగంగా ట్రంప్ ఇండియా ను ఉద్దేశించి, భారదేశం గాలి కూడా రోత లాంటిదే అంటూ ఎద్దవా చేస్తూ మాట్లాడాడు. ట్రంప్ ఇండియా మీద విమర్శలు చేయటం కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటి విమర్శలు చేశాడు.
కరోనా గ్రస్తులకు మందులను అందించే విషయంలో ఇండియా తను కోరినట్టుగా అమెరికాకు సప్లై చేయకపోతే ఆ తర్వాత వ్యవహారం వేరేలా ఉంటుందని బాహాటంగా బెదిరించాడు ట్రంప్. ఇండియాపై దాడి అనేంత తీవ్ర స్థాయి వ్యాఖ్యానాన్ని చేశాడు. ఇక ఇండియాకి పాక్ కి మధ్య జరుగుతున్నా కాశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తానంటూ తనకు తానే పెత్తనం ఎత్తుకున్నాడు. అది సుతారం భారత్ కు నచ్చదని తెలిసిన కానీ, పదే పదే దాని గురించి మాట్లాడటం ట్రంప్ యొక్క తెంపరితనానికి నిదర్శనం.
అలాంటి ట్రంప్ తో ప్రధాని మోడీకి గాఢమైన స్నేహం ఉండటం విశేషం. ట్రంప్ ఇండియా వస్తే గుజరాత్ పర్యటన సందర్భంగా మురికి వాడలు కనిపించకూడదని రోడ్డుకు ఇరు వైపులా గోడలు కట్టించాడు మోడీ. ట్రంప్ కోసం ఏకంగా ప్రపంచమే హౌరా అనే విధంగా ఆతిథ్యము అందించాడు మోడీ, కానీ అమెరికా వెళ్లిన మరుక్షణమే ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మోడీపై ట్రంప్ కున్న అభిమానం ఏమిటో అర్ధం అవుతుంది. దీనికోసమేనా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ట్రంప్ కు స్వాగతం చెప్పింది అంటూ సోషల్ మీడియాలో మోడీపై విమర్శలు గట్టిగానే పడుతున్నాయి.
అమెరికా లో హెచ్1బీ వీసాలపై ఆంక్షలు పెట్టటం వలన ఎక్కువగా ఇబ్బంది పాడేది భారతీయులే, ఆ విషయం తెలిసే ట్రంప్ కావాలనే ఈ విధంగా చేస్తున్నాడు. ఒక పక్క ఇండియాను తక్కువ చేసి మాట్లాడటం, మరోపక్క అమెరికా లో ఉన్న ఇండియన్స్ ను ఇబ్బంది పెట్టటం చూస్తుంటే ట్రంప్ ఒక ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్లు ఉంది . గత ఎన్నికల్లో కూడా లోకల్ సెంటిమెంట్ తీసుకోని వచ్చి, విజయం సాధించాడు. ఇప్పుడు కూడా ఇండియాను టార్గెట్ చేస్తూ అమెరికా లోకల్ సెంటిమెంట్ రెచ్చకొట్టి మరోసారి ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనలో ఉన్నట్లు సృష్టంగా అర్ధం అవుతుంది.