నీరసం వచ్చేసింది బాబుగారూ .. ఇంకెన్నాళ్ళు ఇదే రాజకీయం చేస్తారు ?

జాతీయ పార్టీ అనే పేరు తప్ప కనీసం ఎప్పుడు కూడా జాతీయ స్థాయి పార్టీకి తగ్గ రాజకీయాలు చేయలేదు చంద్రబాబు, ఒకప్పుడు తెలంగాణలో బలమైన రాజకీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేడు ఎన్నికల్లో పోటీచేయడానికి ఆభ్యర్థులు కూడా దొరకని పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో పార్టీ ఉంది కానీ, ఒక్కసారి కూడా బాబు, ఎన్టీఆర్ భవన్ కి వెళ్లిన దాఖలాలు లేవు. వారంలో రెండు మూడు రోజులు తెలంగాణకు కేటాయిస్తానని చెప్పిన నెలలో ఒక్క రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు.

Chandrababu naidu

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా. అభ్యర్థుల్ని బరిలో దింపినా కూడా వారి తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేని దయనీయ స్థితి బాబుది. ఇప్పటి వరకూ కనీసం ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఓ సందేశం ఇచ్చిన పాపాన పోలేదు. ఇతర పార్టీలను విమర్శించడం పక్కనపెడితే.. సొంత పార్టీ గురించి కూడా బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు.అలాంటి బాబుకి ప్రచారం చివరి రోజున ఎందుకో ధైర్యం వచ్చింది. తాను గొప్పలు చెప్పుకున్నా..ఇతరులు విమర్శించడానికి అవకాశం లేకుండా ప్రచారం ముగింపు రోజు మాత్రం అధికారికంగా ఓ ట్వీట్ వేసి మమ అనిపించారు.

“హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధికి టీడీపీ పునాదులు వేసింది, ప్రజా శ్రేయస్సు పట్ల మాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్, సాఫ్ట్ వేర్ రంగం ప్రస్థానం హైటెక్ సిటీ నుంచే మొదలైంది. అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ.. ఇలా మాటలకన్నా చేతల్లోనే ఎక్కువ చూపాం. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కి రప్పించాం, ఉపాధి కల్పించాం, సంపద సృష్టించాం, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాం. ఆ వెలుగులు మళ్లీ రావాలంటే టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించండం, సైకిల్ గుర్తుకి ఓటేయండి.”

చంద్రబాబు మాటలు గమనిస్తే ఓటుకు నోటు భయం ఇంకా వీడినట్లు లేదు. ఎక్కడా కూడా ప్రత్యూర్ది పార్టీని ఒక్క మాట అనకుండా జాగ్రత్త పడ్డాడు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నేతలు కేసీఆర్ ను, తెరాసను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుంటే, 40 ఏళ్ల రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు ఒక్క నికార్సైన విమర్శ కూడా చేయటంపోవటం బాబు యొక్క భయానికి నిదర్శనం అనే చెప్పాలి. ఇప్పటికి కూడా హైదరాబాద్ నా వలనే అభివృద్ధి చెందింది, సైబరాబాద్ ను నేనే కట్టిచాను అని చెప్పుకుంటూ ఓట్లు అడగటం ఏంటి..? ఇలాంటి రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తామంటూ సోషల్ మీడియాలో బాబును ఏకేసుకుంటున్నారు ..

 

Advertisement