ఎన్నికలను హైజాక్ చేసి.. రక్త సిక్తం చేస్తున్న వైసీపీ.. ధ్వజమెత్తిన నాయుడు ద్వయం
PBN - March 10, 2021 / 11:12 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మునిసిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో చాలా చోట్ల వైసీపీ అక్రమాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.. చంద్రబాబు మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఓటర్లను వైసీపీ భయపెడుతోంది. ఓడిపోతారన్న భయంతో టీడీపీ సానుభూతిపరులపై దాడులకు తెగబడుతున్నారు. ఓటింగులో పాల్గొనకుండా చేస్తున్నారు.
ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో అరాచకాలకు, అకృత్యాలకు పాల్పడడం అత్యంత హేయం. వైసీపీ గూండాలకు పోలింగ్ కేంద్రాల్లోకి ఏం పని? ఓటర్లను బెదిరించి పోలింగ్ శాతం పెరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఎస్ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు కూడా అదే పద్దతి అనుసరిస్తే.. ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది. జగన్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత భయంతో ఎన్నికలను హైజాక్ చేసి గెలవాలని చూస్తున్నారు. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ఓటర్లను, అభ్యర్థులను బెదిరిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అధికార పార్టీ దాష్టీకాలను, దుర్మార్గాలను ఎన్నికల సంఘం నిలువరించాలి. అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మరోపక్క అచ్చెన్నాయుడు మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అధికార వైసీపీ నేతల అరాచకాలు మితిమీరుతున్నాయి. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను రక్తసిక్తం చేస్తున్నారు. దాడులు.. దౌర్జన్యాలతో ప్రజలు ఓటు వేసేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. 8వ డివిజన్ వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి రజనీ భర్త కొత్తపల్లి రాజశేఖర్ తెలుగు దేశం పార్టీ సానుభూతి పరులపై దాడికి పాల్పడ్డారు.
దేవినేని అవినాశ్ ప్రోద్బలంతో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి పోలింగ్ శాతం పెరగకుండా చేయడం అత్యంత హేయం. 59వ డివిజన్ పోలింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్సీ కరీమున్నిసా కుమారులు దాదాగిరి చేస్తూ ఓటర్లను భయపెడుతున్నారు. ఫ్యాన్కు ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. పసుపు రంగు చొక్కాతో వచ్చాడనే నెపంతో ఓ పౌరుడిపై దాడికి పాల్పడ్డారు.
59వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సుల్తానా కుటుంబ సభ్యులంతా జనరల్ ఏజెంట్ పాస్తోె పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసి.. రక్త సిక్తం చేస్తున్న వైసీపీ అనుచరులపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలి.