Chandra Babu : ఏపీలో గ్రామా పంచాయితీ ఎన్నికలు జోరు సాగుతుంది. తాజాగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక సర్పంచ్ లు ఐదేళ్లు ఉంటారని అయన అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఇక అధికారంలో ఉండేది రెండేళ్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ఆయన రెండో విడత నామినేషన్లు ప్రారంభమయ్యే ప్రాంతాల నేతలతో మాట్లాడారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, పాత బిల్లుల బకాయీలను వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ద్వారా ఐదేళ్లలో ఐదుకోట్ల రూపాయల పనులు జరుగుతాయని చెప్పారు. ఒక్క ఉపాధి హామీ పథకం కింద వచ్చే ఐదేళ్లలో పదమూడువేల పంచాయతీల్లో 70 వేల కోట్ల పనులు జరుగుతాయని, అందుకే అందరూ నామినేషన్లు వేసి సర్పంచ్ గా గెలిచేందుకు కృషి చేయాలని చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపు నిచ్చారు.
ఇక ఓటమి భయంతోనే పంచాయతీ ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్లకు వైసీపీ ప్రభుత్వం మోకాలడ్డిందని దుయ్యబట్టారు. తర్వాతి దశల్లోనైనా అనుమతించాలని కోరారు. ‘భయోత్పాతం సృష్టించి.. బెదిరించి.. ప్రలోభపెట్టి.. ఏకగ్రీవాలు చేసుకోవాలని వైసీపీ నేతలు అనుకున్నారు. కానీ ప్రజలు ఎదురు తిరిగి నిలబడ్డారు. నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులకు దిగే ప్రమాదం ఉంది. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి’ అని సూచించారు.
అయితే నామినేషన్లలో ఇబ్బందులు ఎదురైతే పార్టీ కంట్రోల్ రూం దృష్టికి తేవాలన్నారు. నామినేషన్ పత్రాలు, ఫిర్యాదు నకళ్లను జతపర్చిన పత్రాలను కలెక్టర్కు, ఎన్నికల సంఘానికి, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నా రు. అచ్చెన్నాయుడి స్వగ్రామం నిమ్మాడలో వైసీపీ గూండాల స్వైరవిహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక వాహనంపై ధీమాగా కూర్చుని పోలీసుల ఎదుటే పచ్చి బూతులు తిడుతూ వైసీపీ మూకలను రెచ్చగొడుతున్న ఆ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫొటోను పోస్టు చేశారు.