Telangana : తెలంగాణలో అధికారంలోకి వస్తాం: కేంద్ర మంత్రి అమిత్ షా.!
NQ Staff - November 26, 2022 / 03:53 PM IST

Telangana : ‘నేను తెలంగాణకు వెళుతున్నా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా వున్నారు..’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా బీజేపీ మరింత బలపడిందన్న అమిత్ షా, దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలో అన్ని రాష్ట్రాల్నీ తమ ప్రభుత్వం సమానంగా చూస్తోందనీ, ఏ రాష్ట్రం పట్లా వివక్ష తమ పాలనలో వుండదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే మాకు బలం..
‘తెలంగాణలో అనూహ్యంగా బలపడ్డాం. అక్కడ పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. దాన్ని మేం భర్తీ చేస్తున్నాం..’ అని చెప్పిన అమిత్ షా, ప్రజలే మాకు అవకాశం ఇవ్వబోతున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అనూహ్యంగా బలపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఒకే ఒక్క సీటు దక్కింది తెలంగాణలో. కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అక్కడి నుంచి బీజేపీ, క్రమంగా తెలంగాణలో బలపడుతూ వచ్చింది.