Bandi Sanjay : మునుగోడు ఉప ఎన్నిక కేసీయార్ సర్కారుని కూల్చేది కాబోతోంది: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బండి సంజయ్

NQ Staff - September 22, 2022 / 10:42 PM IST

160177Bandi Sanjay : మునుగోడు ఉప ఎన్నిక కేసీయార్ సర్కారుని కూల్చేది కాబోతోంది: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బండి సంజయ్

Bandi Sanjay : ‘కేసీయార్ నీ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్’ అయ్యిందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నీతో లడాయికి సిద్ధమైనమ్.. మజ్లిస్‌తో కలిసి వచ్చినా బల ప్రదర్శనకు బీజేపీ సిద్ధమే..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి సవాల్ విసిరారు బండి సంజయ్.

Bandi Sanjay comments on CM KCR

Bandi Sanjay comments on CM KCR

ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడుత విజయవంతంగా పూర్తయ్యింది. ముగింపు సభలో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. పలువురు బీజేపీ ముఖ్య నేతలు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ‘గరీబోళ్ళ రాజ్యం కావాలా.? గడీల రాజ్యం కావాలా ఆలోచించండి..’ అంటూ తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు.

అక్టోబర్ 15 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర..

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనే, ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర తేదీని కూడా ప్రకటించేశారు బండి సంజయ్. అక్టోబర్ 15 నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. పాదయాత్రలో ప్రజల కష్టాలు తనను తీవ్రంగా కదిలించాయని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ అయితే, అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ టీఆర్ఎస్ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించగా, ఆ మైదానమంతా కాషాయ సంద్రమైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ బహిరంగ సభకు.

మునుగోడులో గెలిచేది బీజేపీనే..

మునుగోడులో బీజేపీనే గెలుస్తుందనీ, ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర పక్కా సమాచారం వుందనీ, కేసీయార్ సర్కారుని దించే ఫలితం మునుగోడులో రాబోతోందనీ, మునుగోడు ఉప ఎన్నికతో కేసీయార్ పతనం ఖరారయ్యిందనీ బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు కేసీయార్ ప్రయత్నించారని ఆరోపించారు బండి సంజయ్. అన్ని కులాల్నీ నిర్వీర్యం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అన్నారు.

పాదయాత్రకు అడుగడుగునా కేసీయార్ అడ్డుపడుతున్నారన్న బండి సంజయ్, అధికార పార్టీ ఎత్తుగడలను చిత్తు చేసి విజయవంతంగా పాదయాత్రను కొనసాగిస్తున్నామని అన్నారు.

తెలంగాణలో బీజేపీనే ముందు ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనీ, బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరింత మెరుగైన పాలన అందిస్తామని, ఇప్పుడు అమలవుతున్న చాలా సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ చెప్పారు.