బ్యాక్ టూ బ్యాక్ రాజీనామాలు – చంద్రబాబు కాళ్ళ కింద భూమి కంపిస్తోంది !
PBN - November 10, 2020 / 09:00 AM IST

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అనువవిస్తున్న గడ్డు పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా చవిచూడలేదు. ఎన్నికల్లో ఓటమి అనేది సహజం కానీ ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులే టీడీపీ పార్టీకి ఇబ్బందిగా మారిపోతుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలకు పార్టీ మీదే సరైన నమ్మకం లేదు. ఒకరి తర్వాత ఒకరిగా పార్టీకి రాజీనామా చేసేసి పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నుండి వలసలు తగ్గించాలని భావించిన బాబు, ఎన్నడూ లేని విధంగా పార్టీ పరంగా భారీగా పదవులు పందారం చేశాడు . ఇప్పుడు వాటి వలన కూడా పార్టీలో అసమ్మతి చెలరేగుతుంది.
తాజాగా నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన నేతలకు మొండి చేయి చూపారు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ అధ్యక్షుల ప్రకటన అసమ్మతి రేపింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్న వారిని, గత ఎన్నికల్లో పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన వారిని సైతం పార్టీ పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లా పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతల కనుసన్నల్లోకి పార్టీ వెళ్లడంతో తీవ్ర గందరగోళం రేగింది.
1982 నుంచి పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ పార్టీ క్రియా శీలక సభ్యత్వాలకు రాజీనామాలు చేయడం జిల్లాలో ప్రకంపనలు మొదలయ్యాయి. రమేష్‌రెడ్డి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రమేష్‌రెడ్డి భార్య అనురాధ నెల్లూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత పదవులు లేకపోయినప్పటికీ నిస్వార్థంగా పార్టీలో పని చేసి ఆర్థికంగా కూడా పూర్తిగా నష్టపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజా రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనూరాధ శనివారం పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నెల్లూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌అజీజ్‌కు లేఖ పంపారు.
ఇక నెల్లూరు రూరల్ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ఆనం జయకుమార్‌రెడ్డికి కూడా పార్టీ మొండిచేయి చూపింది. ఆయన కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఉన్నారు, అదే విధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు కూడా అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే దారిలో మరికొందరు టీడీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బాబు పంచిన పదవుల పందారం ఇప్పుడు ఆయనకే పెద్ద షాక్ ఇస్తూ కాళ్ళ కింద భూమి కంపించేలా చేస్తుంది