సబ్బంహరి దారిలోనే ఉండవల్లి… బాబుతో జాగ్రత్త సుమ
PBN - October 31, 2020 / 06:00 AM IST

గత కొద్దీ రోజుల నుండి గమనిస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శల హస్త్రాలు సంధిస్తున్నాడు. డైరెక్ట్ గా ఘాటైన విమర్శలు కాకుండా సలహాల ఇస్తున్న రూపంలో విమర్శలు చేయటం చేస్తున్నాడు. సాధారణ నేతలు చేసే విమర్శకాలకు, ఉండవల్లి చేసే విమర్శకులకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఉండవల్లి ఒక రాజకీయ మేధావిగా, విశ్లేషకుడిగా, తటస్తుడు గా పేరుంది కాబట్టి, ఉండవల్లి ఆరోపణలు జనాలు చూసే కోణం వేరుగా ఉంటుంది, అలాంటి ఉండవల్లి జగన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తే కచ్చితంగా అవి జగన్ ను ఇబ్బందుల్లోకి నెట్టటం ఖాయం.
ఉండవల్లి సీఎం జగన్ మీద ఈ విధంగా ఆరోపణలు చేయటం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హస్తం ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి రాజకీయాలు చేయటంతో బాబు సిద్ధహస్తుడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు, గతంలో సబ్బం హరి విషయంలో కూడా ఇలాగే చేశాడు, కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత సరైన వేదిక లేకపోవటంతో రాజకీయాల గురించి సున్నితమైన విమర్శలు చేస్తూ,. విశాఖ ఆక్టోపస్ గా పేరు తెచ్చుకున్న సబ్బం హరి , మెల్ల మెల్లగా జగన్ మీద విమర్శలు చేయటం మొదలుపెట్టాడు.
ఇప్పట్లో ఉండవల్లి మాదిరిగానే సలహాలు ఇస్తున్న రూపంలో జగన్ పై విషం చిమ్మే ప్రయత్నాలు అనేకం చేశాడు సబ్బం హరి. ఎన్నికల కి ముందు మరింత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు, కానీ అతని ప్రయత్నాలు ఏమి ఫలించకపోగా, అతని మాస్క్ కొద్దీ రోజుల్లోనే బయటపడింది, 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీచేసి ఓడిపోయాడు. దీనితో సబ్బం హరి వెనకుండి ఇలాంటి ఆరోపణలను చేపించింది బాబు అనే విషయం తెలిసిపోయింది. ఇక ఎన్నికల అనంతరం సబ్బం హరిని బాబు పట్టించుకున్న దాఖలాలు లేవు, కానీ సబ్బం హరి మాత్రం దానికి తగ్గ “ప్రతిఫలం” జగన్ సర్కార్ పొందుతున్నాడు. విశాఖలో ఈ మధ్యనే సబ్బం హరి ఇంటి గోడను అధికారులు కూల్చివేయటం కూడా జరిగింది.
ఇక సరిగ్గా ఇప్పుడు ఉండవల్లి విషయంలో కూడా అదే జరుగుతుంది. సబ్బం హరి మాదిరి రాజకీయ పరంగా సరైన వేదిక లేక ఇబ్బంది పడుతున్నాడు, జగన్ మా వాడే అంటూ పైకి చెపుతున్న కానీ, అందుకు విరుద్ధంగా ఆరోపణలు చేయటం చూస్తుంటే బాబు హస్తముందని తెలుస్తుంది, సబ్బం హరి మాదిరిగానే ఉండవల్లి కూడా బాబు ఉచ్చులో ఇరుక్కున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి, అదే కనుక నిజమైతే సబ్బం హరికి పట్టిన గతే ఉండవల్లికి కూడా పట్టే అవకాశం లేకపోలేదు.