ACB : ఇంద్రకీలాద్రిపై కొనసాగుతోన్న ఏసీబీ దాడులు.. ఆ మంత్రినే టార్గెట్ చేశారా..!?

ACB

ACB (ఏసీబీ) : ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాలు ఎక్కవగా వినిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన ప్రఖ్యాత కనకదుర్మమ్మ ఆలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై.. స్టోర్, చీరల విభాగం సహా పరిపాలన విభాగం, ప్రసాదాలు కౌంటర్లు, తయారీ విభాగం, టికెట్‌ కౌంటర్లలో అధికారులు సోదాలు చేశారు. 300 రూపాయల దర్శనం టికెట్టు కౌంటర్లో లెక్కకు మించి ఉన్న నగదును అధికారులు గుర్తించినట్టు సమాచారం. అలాగే ఆలయ ఈవో సురేష్ బాబు, సూపరిటెండెంట్ స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అమ్మవారి ఆలయంలో జరిగిన కీలక లావాదేవీలకు సంబంధించిన బిల్లులను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం సోదాల్లో పాల్గొంది.

అయితే ముఖ్యంగా అభివృద్ధి పనుల బిల్లులు, సరుకుల కొనుగోళ్లు, టికెట్లు, చీరల విక్రయం, తలనీలాల టెండర్లు, సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపుతో పాటు ఫెర్రీలో స్క్రాప్ విక్రయాలకు సంబంధించిన బిల్లులను అధికారులు సేకరించారు. అలాగే ఫెర్రీలో స్క్రాప్ విక్రయించగా వచ్చిన సొమ్మును ఎక్కడ డిపాజిట్ చేశారనేదానిపై వివరాలను కూడా సేకరించారు. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.58 కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలపై ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పటివరకు పరిశీలంచిన అంశాల్లో లెక్కలు తేలనట్లుగా తెలుస్తోంది. అలాగే అంతర్గత బదిలీలు, టెండర్లలో అవకతవకలను గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. సోదాలు పూర్తైన తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించే అవకాశముంది. ఈ దాడులపై కనకదుర్గ ఆలయంలో ఏసీబీ దాడులపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. సాధారణంగా వచ్చే ఫిర్యాదుల్లో భాగంగానే ఏసీబీ దాడులు చేస్తున్నారని తెలిపారు. ఎక్కడ తప్పుజరిగినా దాని వెనుక ఎవరున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నారు. అందులో భాగంగా అవినీతి పరుల వేట సాగుతోందన్నారు.

Advertisement