జగన్ తర్వాత మెజారిటీ ఆ ఎమ్మెల్యేదే.. కానీ పట్టించుకునేది ఎవరు ?
Admin - November 2, 2020 / 12:00 PM IST

అధికార పార్టీలో ఉంటే చాలు పదవులు ఉన్నా లేకపోయినా పనులు జరిగిపోతాయి. అంతా తామే అన్నట్టు వ్యవహారిస్తుంటారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల కన్నా పాలక పక్షంలో ఖాళీగా ఉన్న నేతలకే పవర్ ఎక్కువగా ఉంటుంది. కానీ అధికార పార్టీలో ఉండి, అందునా పదవిలో ఉన్నా కూడ కొందరికి మాత్రం ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అలాంటి వాళ్ళది బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారట గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈయనేమీ మొదటిసారి ఎమ్మెల్యే కాదు రెండవసారి ఎమ్మెల్యే. మొదటిసారి ప్రజారాజ్యం నుండి గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి భారీ మెజారిటీతో విజయం అందుకున్నారు.

Anna Rambabu
కానీ ఏమేమిటి ప్రయోజనం. రికార్డ్ స్థాయి మెజారిటీ అయితే ఉంది కానీ పార్టీలోనే సరైన ప్రాముఖ్యత దొరకడం లేదట. ఆయన అనుకున్న పనులేవీ జరగడంలేదట నియోజకవర్గంలో. తన మనుషులకు చిన్న చిన్న పదవులు ఇప్పించుకోవడం, పనులు చేసిపెట్టడం లాంటివి కూడ చేయలేకపోతున్నారట. జిల్లా మంత్రులు కానీ, వైసీపీ అగ్రనేతలు కానీ ఆయన్ను అస్సలు పట్టించుకోవట్లేదట. జిల్లాలో ఏం జరిగినా ఆయన పాత్ర శున్యమట. మంత్రులు సైతం ఈయన నోటీసుకు వెళ్లకుండానే వారే పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారట. నామినేటెడ్ పోస్టుల భర్తీలో అయితే కనీసం ఈయన అభిప్రాయం కూడ తీసుకోలేదని చెబుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఇటీవల కరోనా క్వారంటైన్ సెంటర్ కోసం తన కాలేజీని ఇచ్చారట ఈ ఎమ్మెల్యే. బాగా వాడుకుని అద్వానపు స్థితిలో తిరిగి అప్పగించారట. వాటి మరమ్మత్తులకు భారీగా ఖర్చవుతుందట. ఈ సంగతిని పార్టీ పెద్దల వద్దకు, అధికారులు వద్దకు తీసుకెళ్లినా రెస్పాన్స్ లేదట. ఇక ఇలా కాదని ముఖ్యమంత్రిని కలిసి తన గోడును వెళ్లబోసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఆయనకు జగన్ అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతోందట. ఇలా అన్ని విధాలా నిరాదరణకు గురవుతున్న ఆ ఎమ్మెల్యే తన బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలీక ఆవేదన చెందుతున్నారట.