YS Sharmila: వైఎస్ షర్మిల సీరియస్ జోకులు

YS Sharmila వైఎస్ షర్మిల రీసెంటుగా తన మూడు రోజుల ఉద్యోగ దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ రెండేళ్లలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక తల తాకట్టు పెట్టయినా నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తానని మాటిచ్చారు. వైఎస్ షర్మిల ఇంకా పార్టీ పేరే ప్రకటించ లేదు. జెండా, అజెండా ఏంటో తెలియదు. ఆ పార్టీలో బలమైన నాయకుడు ఒక్కరూ లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పాల్గొన లేదు. ప్రజల స్పందన ఏంటో తెలియదు. అయినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తానని వైఎస్ షర్మిల ప్రకటించటం అత్యాశే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అన్నకే.. అన్నేళ్లు..

వైఎస్ షర్మిల అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కే పవర్ లోకి రావటానికి పదేళ్లు పట్టింది. అలాంటిది షర్మిల కేవలం రెండు సంవత్సరాల్లో ఎలా అధికారంలోకి రాగలరు?. పార్టీ పెట్టిన ఏడాది లోపు అధికారంలోకి రావటం ఇప్పటివరకు ఎన్టీఆర్ ఒక్కడికి మాత్రమే సాధ్యమైందని గుర్తుచేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపటానికి ఇలాంటి మాటలు చెబితే ఓకే గానీ పొద్దంతా ఈ పగటి కలల్లోనే విహరిస్తే మాత్రం కష్టమేనని అనలిస్టులు అంటున్నారు. మరికొందరేమో వైఎస్ షర్మిల సీరియస్ జోకులు వేస్తున్నారని సెటైర్లు విసురుతున్నారు. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని, టూ మచ్ గా వ్యవహరిస్తున్నారని కూడా అంటున్నారు.

వారం రోజులు సెలవ్

వైఎస్ షర్మిల క్యాంప్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆమె చేపట్టిన ఉద్యోగ దీక్షలో పాల్గొన్నవారిలో ఇప్పటికే ముగ్గురికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని, దీంతో చాలా మంది పరీక్షల కోసం క్యూ కట్టారని తెలుస్తోంది. వారిలో ఇంకెంత మంది ఆ మహమ్మారి బారిన పడతారో అనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ నివాసానికి వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. దీంతో నిత్యం నిర్వహించే జిల్లాల వారీ వైఎస్ అభిమానుల ఆత్మీయ సమావేశాలు కొద్ది రోజులు బంద్ కానున్నాయి. వైఎస్ షర్మిల ఎడమ చేతికి తగిలిన గాయం ఇంకా మానినట్లు లేదు. ఎందుకంటే నిన్న జరిగిన వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకల్లో వైఎస్ షర్మిల ఆ చేతికి కట్టుతోనే కనిపించారు.

Advertisement