YS SHARMILA: వైఎస్ షర్మిల.. మళ్లీ మొదలుపెట్టింది..

YS SHARMILA: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వారం పది రోజులుగా సైలెంటుగా ఉన్న వైఎస్ షర్మిల శిబిరం రెండు మూడు రోజుల కిందటి నుంచి మళ్లీ రాజకీయం మొదలుపెట్టింది. తొలుత ట్విట్టర్ లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుపెట్టిన ఈ టీమ్ ఇవ్వాళ ఆఫ్ లైన్ లోనూ పొలిటికల్ కార్యకలాపాలను ఆరంభించింది. ముందుగా రాష్ట్ర గవర్నర్ తమిళసైకి లేఖ రాసింది. ఆ తర్వాత వైఎస్ షర్మిల మళ్లీ సోషల్ మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు సర్కార్లకూ సిగ్గు లేదని విమర్శించారు. కరోనా పరీక్షలు లేవు, హాస్పిటల్స్ లో బెడ్లు లేవు, పట్టించుకోవటానికి డాక్టర్లు లేరు, ప్రాణ వాయువు లేదు, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే ఆలోచన లేదు, రోగులపై కనికరం లేదు.. అంటూ షర్మిల తప్పుపట్టారు.

 

ఇలా ఆదేశించండి మేడం..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి వైఎస్ షర్మిల ప్రధాన అనుచరురాలు ఇందిరా శోభన్ ఇవాళ శుక్రవారం లేఖ రాశారు. కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చేలా చూడాలని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా బెడ్లు దొరికే పరిస్థితి కరువైనందున, ప్రైవేట్ హాస్పిటల్స్ లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేయించుకునే స్థోమత పేదలకు లేనందున కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఇందిరా శోభన్ అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి బారిన పడి చనిపోయిన పాత్రికేయులకు రూ.50 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మొద్దు నిద్రలో మునిగి..

న్యాయస్థానాలు జోక్యం చేసుకొని చెబితే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతలు తెలియట్లేదని, ఆ రకంగా మొద్దు నిద్రలో మునిగి తేలుతోందని వైఎస్ షర్మిల విమర్శించారు. కొవిడ్, మున్సిపల్ ఎన్నికలు, టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం వంటి అంశాల్లో కోర్టులు ఎప్పటికప్పుడు కేసీఆర్ సర్కారుకు మొట్టి కాయలు వేస్తూనే ఉన్నాయని నిన్న గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు ఉన్నాయని, ముందు వాటిని నింపాలని సూచిస్తే పట్టించుకోని ముఖ్యమంత్రి ఇప్పుడు కోర్టుకు ఏం జవాబు చెబుతారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నాలుగు వారాల్లోగా టీఎస్పీఎస్సీ సభ్యులను నియమించాలని, లేకపోతే ఆ సంస్థను మూసేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement