ఎదురు – ఎదురుగా కూర్చోబోతోన్న వై ఎస్ జగన్ – చంద్రబాబు :: ఏపీ చరిత్రలోనే మిస్ అవ్వకూడని సీన్ ఇది
Ajay G - March 13, 2021 / 10:22 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య ఎప్పుడైనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాళ్ల మధ్య ఉన్న వైరం ఇప్పటిది కాదు. వైఎస్సార్ హయాం నుంచి వైఎస్ కుటుంబానికి, చంద్రబాబు కుటుంబానికి పడదు. తర్వాత వైఎస్ కొడుకు జగన్ తో కూడా చంద్రబాబుకు పడదు. అటువంటి ఇద్దరు ఎదురు పడితే ఏం జరుగుతుంది. ఇద్దరూ ఎదురు పడిన సందర్భాలు చాలా తక్కువ. ఒకరిని మరొకరు తిట్టుకోవడం, విమర్శించడం సహజమే కానీ.. ఎదురుపడ్డప్పుడు మాత్రం ఎవ్వరూ తిట్టుకోరు. ఇద్దరూ ప్రత్యక్షంగా కలిసింది కూడా చాలా తక్కువ.
అటువంటి ఇద్దరు త్వరలో కలిసేందుకు అవకాశం వచ్చింది. ఈనెల 17న ఇద్దరూ ఎదురెదురుగా కూర్చునే అవకాశం వచ్చింది. ఈనెల 17న ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్ సారథ్యంలో మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, కమిషన్ సభ్యుల ఎంపిక కోసం అత్యున్నత కమిటీ సమావేశం జరగనుంది.
రూల్స్ ప్రకారం.. ఈ కమిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, అసెంబ్లీ, శాసన మండలిలో ప్రతిపక్ష నేతలు, రాష్ట్ర హోమ్ మంత్రి సభ్యులుగా ఉంటారు.
ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కాబట్టి.. ఈ సమావేశానికి ఒక సభ్యుడిగా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. దీంతో.. చంద్రబాబు ఈ సమావేశానికి వస్తారా? రారా? వస్తే.. సీఎం జగన్ తో మాట్లాడుతారా? ఇద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటారు? అనేదానిపై ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది.
అయితే.. సీఎం జగన్ తో పాటు.. చంద్రబాబు, శాసన మండలి ప్రతిపక్షనేత యనమల, మండలి చైర్మన్ షరీఫ్ కూడా ఈ సమావేశానికి రావడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ కమిటీలో ముగ్గురు టీడీపీ సభ్యులు కాగా.. మానవ హక్కుల కమిషన్ కమిటీ విషయంలో ప్రతిపక్షల సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈనెల 17 మీదనే అందరి కళ్లు ఉన్నాయి. ఆరోజు ఏం జరుగుతుందో చూడటం కోసం ఆతృతగా ఏపీ మొత్తం ఎదరుచూస్తోంది.