Umpire: ఆ ఐరన్ లెగ్ అంపైర్‌ ఈ ఫైనల్ మ్యాచ్ కు వద్దే వద్దంటున్న ఇండియన్ ఫ్యాన్స్

Umpire: క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల‌న ఐపీఎల్ టోర్నీ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. సెప్టెంబ్ 19 నుండి మిగ‌తా షెడ్యూల్ కొన‌సాగించ‌నున్నారు నిర్వాహ‌కులు. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్‌కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. భారత జట్టు గతకొన్నేళ్లుగా ఇంటా బయటా అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో పోరుకి సిద్ధ‌మైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన భార‌త్ ఈనెల 18 నుండి జ‌ర‌గ‌నున్న టెస్ట్ సిరీస్‌లోను గెలిచి తొలి టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అందుకోవాలని తహతహలాడుతోంది.

ICC Cricket Umpire

ఫైనల్‌కు సంబంధించిన అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. చారిత్రక పోరులో ఫీల్డ్‌ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, మైకేల్ గాఫ్‌.. నాలుగో అంపైర్‌గా అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్‌ వ్యవహరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అంపైర్ల ప్ర‌క‌ట‌న త‌ర్వాత భార‌త అభిమానుల‌లో ఆందోళ‌న క‌లుగుతుంది. అందుకు కార‌ణం అంపైర్స్ లిస్ట్‌లో భారత అభిమానులు ఐరెన్‌ లెగ్‌గా పరిగణించే రిచర్డ్ కెటిల్ బరోకు కూడా స్థానం ఇవ్వ‌డం. కెటిల్ బరోను థర్డ్‌ అంపైర్‌గా నియమిస్తూ ఐసీసీ ప్రకటన విడుదల చేయడంతో మ‌రింత ఆందోళ‌నకు గుర‌వుతున్నారు.

ICC Cricket Umpire

భార‌త అభిమానులు ఆందోళ‌న చెంద‌డానికి కార‌ణం రిచర్డ్ కెటిల్ బ‌రో అంపైరింగ్ చేసిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పరంపర కొనసాగింది. బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2015 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 95 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి ఇంటి దారిపట్టింది. ఇక 2016లో జరిగిన టీ 20 ప్ర‌పంచ క‌ప్‌లో మంచి దూకుడు మీదున్న టీమిండియా సెమీస్‌లో ఓడింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో పాక్ చేతిలో ఓడింది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లోనూ భారత్‌.. న్యూజిలాండ్ చేతిలో ఓడింది. కెటిల్ బ‌రో ఈ మ్యాచ్‌లు అన్నింటికి అంపైరింగ్ చేయ‌డంతో భార‌త్ ఓట‌మి పాలైంద‌ని అభిమానులు భావిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లోను కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తుండగా, పాత చరిత్ర‌ను కోహ్లీ సేన తిర‌గ‌రాస్తుందా అనేది చూడాలి.