భర్త చికెన్​ తిన్నాడనే కోపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని భార్య ఆత్మ‌హ‌త్య‌

ఒక‌ప్పుడు భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య మంచి అండ‌ర్‌స్టాండిగ్ ఉండేది. కాని ఇప్పుడ‌లా కాదు భ‌ర్త ఒక మాట అన్నాడ‌ని భార్య క్ష‌ణికావేశంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతుంది. చిన్న చిన్న కార‌ణాల వ‌ల‌న నిండు జీవితాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసుకుంటున్నారు. తాజాగా ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​లో భ‌ర్త చికెన్ తిన్నాడ‌నే కోపంతో తన ఒంటిపై కిరోసిన్​ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

వివ‌రాల‌లోకి వెళితే కరౌదా గ్రామానికి చెందిన​ ఓ వ్యక్తి ఆగస్టు 22న తన బంధువుల ఇంట్లో చికెన్​ తిని వ‌చ్చాడు. శ్రావ‌ణ మాసం చివ‌రి రోజు చికెన్ తిని వ‌చ్చినందుకు భార్యకు ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. సాధారణంగా ప్రజలు శ్రావణ మాసంలో నాన్‌ వెజ్‌ తినకూడదనే నియమాలను పాటిస్తారు. మరికొందరిలో ఆ పట్టింపులు ఎక్కువగానే ఉంటాయి.

మనీషా సింగ్ (19) అనే మ‌హిళ‌కు ఆ ప‌ట్టింపు మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డం ఆమె చ‌నిపోవ‌డానికి కార‌ణం అయింది. రాఖీ రోజున మ‌నీషా తన భర్త రామజన్మతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రానికి వచ్చారు. ఇంతలో రామజన్మ పొరుగున ఉన్న తన అత్త ఇంటికి వెళ్లి చికెన్‌ తింటుండగా ఆమె వద్దని వారించింది.

రామ్ జ‌న్మ భార్య మాట‌ను లెక్క చేయ‌కుండా చికెన్ ఆర‌గించ‌డంతో ఆమె ఆగ్ర‌హానికి అంతులేకుండా పోయింది.శ్రావణ మాసం చివ‌రి రోజు వ‌ద్ద‌న్నా కూడా చికెన్ తింటున్నావా అని కోపంగా మ‌నీషా సింగ్ ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. భార్య‌కు న‌చ్చ‌జెపుదామ‌ని భ‌ర్త వెళ్ల‌గా ఆమె మంట‌ల‌లో కాలుతూ క‌నిపించింది. భార్య‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌గా, అప్ప‌టికే ఆమె శ‌రీరం స‌గానికి పైగా కాలిపోయింది. అంబికాపుర్​ మెడికల్​ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె చికిత్స పొందుతూ మరణించింది.