Madhya Pradesh : నాలుగు కాళ్ళతో ఆడ శిశువు జననం.!
NQ Staff - December 16, 2022 / 02:20 PM IST

Madhya Pradesh : ఈ భూమ్మీద వింతలకు కొదవ లేదు.! ఔను, రెండు తలలతో శిశువు జన్మించడం, శరీరాలు అతుక్కుపోయి శిశువులు జన్మించడం… తరచూ జరిగే వ్యవహారాలే.!
నిజానికి, ఒకప్పుడు వీటిని వింతలుగా భావించేవారు. ఇప్పుడేమో, ఇలాంటి ‘పుట్టుకల’ గురించి చాలా పరిశోధనలు పుట్టుకొచ్చేశాయ్. ఎందుకు అలా శిశువులు జన్మిస్తున్నారనేదానికి శాస్త్రీయ ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అయినాగానీ, ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ జనం ఆశ్చర్యపోతూనే వున్నారు.. వింతగా చూస్తూనే వున్నారు.
నాలుగు కాళ్ళ ఆడ శిశువు..
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ మహిళకు నెలలు నిండి ప్రసవమైంది. ఆమె ఓ నాలుగు కాళ్ళ వింత శిశువుకు జన్మనిచ్చింది. పుట్టింది ఆడపిల్ల. ఆమెకు సాధారణంగా వుండాల్సిన రెండు కాళ్ళకు బదులుగా నాలుగు కాళ్ళున్నాయి.
బిడ్డ పుట్టిందని సంతోషపడాలా.? లేదంటే, నాలుగు కాళ్ళతో జన్మించిన శిశువుని ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందాలో అర్థం కావడంలేదు ఆ మహిళకి.
నాలుగు కాళ్ళతో శిశువు జన్మించినా, ఆ శిశువు ఆరోగ్యంగానే వుందని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటివి జరుగుతుంటాయన్నది వైద్యుల వాదన. తెలంగాణలో వీణా-వాణి అనే కవలలు తలలు అతుక్కుని జన్మించారు.. వారిప్పుడు పెరిగి పెద్దవారయ్యారు కూడా.