అల్లుడు అన్ని కష్టాల్లో ఉంటే బాలకృష్ణ నోరు మెదపరేంటి ?
Admin - October 25, 2020 / 12:17 PM IST

గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందని చెబుతూ విశాఖ మున్సిపల్ అధికారులు యూనివర్సిటీ నిర్మాణాలు కొన్నింటిని కూలగొట్టడం సంచలం రేపింది. గీతం యాజమాన్యం ఎండాడ, రిషికొండ ఏరియాల్లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని అనుమతులు లేకుండా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందని, ఆ భూమి విలువ 800 కోట్లు ఉంటుందని అందుకే కూల్చేసి ప్రభుత్వం తన భూమిని తాను స్వాధీనం చేసుకుందని పాలక పక్షం అంటోంది. గీతం యూనివర్సిటీ చైర్మన్ బాధ్యతలను శ్రీభరత్ చూసుకుంటున్నారు. అయన స్వయానా నందమూరి బాలకృష్ణకు చిన్నల్లుడు . తెలుగుదేశం పార్టీ నేత కూడ.

balakrishna with his son in laws
అందుకే వ్యవహారం ఇంత వేడెక్కింది. చంద్రబాబు హయాంలో ఆయన అండ చూసుకుని గీతం యాజమాన్యం ఈ ఆక్రమణలకు పాల్పడిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే కేవలం కక్షపూరిత కుట్రల్లో భాగంగానే గీతం యూనివర్సిటీ నిర్మాణాలను కూల్చివేశారని ప్రతిపక్షం టీడీపీ ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు అయితే వైసీపీ పాలనలో రాష్ట్రం బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా అయిందని విరుచుకుపడిపోయారు. ఈ వివాదంపై టీడీపీలోని దాదాపు ముఖ్య నేతలందరూ స్పందించారు, అలవాటుగా ఖండించారు. కానీ శ్రీభరత్ మామ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం మాట్లాడలేదు.
మామూలుగానే బాలకృష్ణ టీడీపీ వ్యవహారాల్లో పెద్దగా వేలు పెట్టారు. తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతుంటారు. అందుకే ఏ విషయంలోనూ ఆయన స్పందన కోసం జనం కానీ టీడీపీ నేతలు కానీ ఎదురుచూడరు. కానీ ఇది ఆయన చిన్నల్లుడి సంగతి కాబట్టి ఆయనేమైనా మాట్లాడతారా అనే చిన్న ఉత్సుకత జనంలో కలిగింది. కానీ బాలకృష్ణ స్పందించలేదు. దీన్ని కారణంగా తీసుకున్న కొందరు బాలయ్య నోరెత్తలేదు అంటే అక్కడ తప్పు జరిగిందనే కదా అర్థం. ఎలాంటి తప్పు లేకపోతే అల్లుడికి అంత నష్టం వాటిల్లిన బాలయ్య మౌనంగా ఉంటారా అంటూ ప్రశ్నల బాణాలు వదులుతున్నారు.