WhatsApp : వాట్సప్ వాయిస్, వీడియో కాల్స్ ఇకపై డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల్లోనూ..
Kondala Rao - March 4, 2021 / 09:22 PM IST

WhatsApp : ప్రముఖ సోషల్ మీడియా(ఫేస్ బుక్)కి చెందిన వాట్సాప్ ఈ రోజు (గురువారం) ఒక కీలక ప్రకటన చేసింది. ఇన్నాళ్లూ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వాడుకోవటానికి వీలున్న వాయిస్, వీడియో కాల్స్ ని ఇకపై డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల్లోనూ వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ పైన చేసుకునే కాల్స్ కి కూడా ఎండ్–టు-ఎండ్ ఎన్ స్క్రిప్ట్ టెక్నాలజీ రక్షణ కల్పిస్తున్నామని పేర్కొంది. దీనివల్ల వాట్సప్ సంస్థ సైతం స్మార్ట్ ఫోన్లలో గానీ కంప్యూటర్స్ లో గానీ ఈ వాయిస్ కాల్స్ ని వినటానికి, వీడియో కాల్స్ ని చూడటానికి ఛాన్సే ఉండదని, ప్రైవసీకి ఢోకా లేదని భరోసా ఇచ్చింది.
ప్రస్తుతానికి వన్-టు-వన్..
డెస్క్ టాప్స్, ల్యాప్ టాప్స్ లో ప్రస్తుతానికి ఒకరి నుంచి ఒకరికి మాత్రమే కాల్స్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందించింది. ఈ ఫీచర్ ని భవిష్యత్తులో గ్రూప్ కాల్స్ కి కూడా వర్తింపజేస్తామని తెలిపింది. ఈ సిస్టమ్ కాల్స్ మరింత సౌకర్యవంతంగా, హైక్వాలిటీతో ఉంటాయని చెప్పింది. వాట్సప్ కాల్స్ చేస్తున్న, తరచూ ఎక్కువ సేపు మాట్లాడుతున్నవారి సంఖ్య ఏడాది కాలంగా క్రమంగా పెరుగుతూ వస్తోందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం కోసం కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది.

WhatsApp : voice-video-calls-on-desktop-laptop-also
ఒక్క రోజే 1.4 బిలియన్ కాల్స్?: WhatsApp
‘‘2021 జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం సందర్భంగా సంఖ్యాపరంగా వాట్సాప్ కాల్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. యూజర్లు ఒక్క రోజే ఏకంగా 1.4 బిలియన్ వాయిస్, వీడియో కాల్స్ చేశారు. వీడియో కాల్స్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా పక్కనే ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. డెస్క్ టాప్స్ లోనూ ల్యాండ్ స్కేప్, పోర్ట్రెయిట్ ఓరియెంటేషన్ లో వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ స్పెషల్, సెపరేట్ విండోని సిస్టమ్ మానిటర్ పై అంచున పెట్టుకొని, కింద భాగంగా యథావిధిగా వాట్సాప్ ఛాటింగ్ చేసుకోవచ్చు. ఒకే సమయంలో రెండు పనులు నడుస్తాయి. ఈ ఆప్షన్ ని వాడుకోవాలంటే ఫోన్ లో డేటా, కంప్యూటర్ కి ఇంటర్నెట్ కనెక్షన్, వెబ్ కెమెరా, హెడ్ సెట్/మైక్రోఫోన్ వంటివి ఉండాలి. కాల్ అనేది ఫోన్ నుంచి వెళ్లకపోయినా ఆన్ లైన్ లో ఉండటం కంపల్సరీ’’ అని వాట్సప్ వివరించింది.