Shiva Ganga theatre: కూలిన థియేట‌ర్ గోడ‌.. ధ్వంస‌మైన వాహ‌నాలు

Shiva Ganga theatre: హైద‌రాబాద్ వ‌ర్షంలో త‌డిసి ముద్దైంది. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్‌, పంజాగుట్ట, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, రాంనగర్‌, మోహిదీపట్నం, లంగర్‌హౌజ్‌, అత్తాపూర్‌లో వర్షం పడింది.

Wall of Shiva Ganga theatre collapses, 50 vehicles damaged
Wall of Shiva Ganga theatre collapses, 50 vehicles damaged

దీంతో అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిప‌డ్డారు. జీహెచ్‌ఎంసీ హై అలర్డ్‌ ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.

హైటెక్‌ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ రోజు మ‌ధ్యాహ్నం కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అయితే నిన్న సాయంత్రం కురిసిన వ‌ర్షానికి సరూర్ నగర్ శివగంగ థియేటర్ గోడ కూలి, అక్క‌డ పార్క్ చేసిన బైకులపై ప‌డింది.

సినిమాకు వచ్చి.. పార్కింగ్‌లో పెట్టిన వాహనాలపై గోడ కూలిపోవ‌డంతో దాదాపు వందకు పైగా ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. వాహనాల యజమానులు ఫస్ట్ షో సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు నేటి ఉదయం థియేటర్‌ను పరిశీలించారు. జేసీబీతో గోడను తొలగించి వాహనాలను బయటకు తీశారు.