Anasuya ఇన్నాళ్ళు బుల్లితెర పై బోలెడంత వినోదం పంచిన యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం వెండితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వంలో ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమా చేయగా, ఈ మూవీ విడుదల గత ఏడాది నుండి వాయిదా పడుతూ వచ్చింది. సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తై రిలీజ్ చేద్ధామని అనుకుంటున్న సమయంలో లాక్డౌన్ ప్రకటించడంతో రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 29న థియేటర్స్‌లో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. లాక్డౌన్ సమయంలో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవ్వగా, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు, కాని అలా జరగలేదు.
‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాలోని నీలి నీలి ఆకాశం అనే సాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట కొన్ని మిలియన్స్ వ్యూస్ సాధించడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ప్రదీప్, అమృతా నాయర్ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, ఈ ట్రైలర్ చూశాక అభిమానులు సినిమా హిట్ అనే నిర్ణయానికి వచ్చారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమాని వీలైనంత మేరకు జనాలలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ . తాజాగా ‘వా వా మేరే బావ’ అంటూ సాగే పాటను ప్రమోషన్లో భాగంగా విడుదల చేశారు.
చిత్రం నుండి విడుదలైన ప్రతి సాంగ్ ప్రేక్షకులని ఎంతగానో అలరించగా, ఇక ‘వా వా మేరే బావ’ అంటూ సాగే ప్రమోషనల్ పాట కూడా ఆకట్టుకుటుంది. ఈ పాట విశేషం ఏంటంటే సింగిల్ టేక్‌లో చిత్రీకరించడం. ఇక బుల్లితెరపై సత్తా చాటుతున్న యాంకర్స్ అనసూయ, శ్రీముఖి, రష్మీలు ఈ సాంగ్‌లో ప్రదీప్‌తో కలిసి స్టెప్పులేశారు. హుషారైన పాటకు అందాల భామలు వేసిన స్టెప్పులు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నాయి. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. కన్నడలో పలు విజయవంతమైన సినిమాలు తీసిన ఎస్.వి.బాబు ఈ చిత్రాన్ని ఎస్.వి. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.