Virat Kohli: విరాట్ కోహ్లీకి వింత పరిస్థితి.. నవ్వాలో ఏడ్వాలో తెలియట్లేదు..

Kondala Rao - March 13, 2021 / 02:46 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లీకి వింత పరిస్థితి.. నవ్వాలో ఏడ్వాలో తెలియట్లేదు..

Virat Kohli టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వింత పరిస్థితి ఎదురైంది. దీంతో అతనికి నవ్వాలో ఏడ్వాలో తెలియట్లేదు. ఆస్ట్రేలియాతో వాళ్ల గడ్డ మీద, ఇంగ్లండ్ తో మన గడ్డ మీద జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల్లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ఈ సెంచరీల వీరుడు లేటెస్టుగా నిన్న రాత్రి మొతెరా స్టేడియంలో ఆంగ్లేయులతో జరిగిన ఆరంభ ట్వంటీ20 మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. కీలకమైన సమయంలో అతను అనూహ్యంగా సున్నా రన్నులకే వెనుదిరగటం చూశాం. క్రికెట్ లో ఎంత పెద్ద మొనగాడైనా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారిపట్టడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఈ గేమ్ ఇంతే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు? అనే ‘లవకుశ’ పాట మాదిరిగా ఈ ఆటలో కూడా ఏ బంతికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే..

లైఫ్ ఈజ్..

జీవితం కూడా క్రికెట్ లాంటిదేనట. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ‘అంతే సంగతలు’ అని ఉత్తరాఖండ్ పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్లే కాదు. ఏ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులైనా వాహనదారులకు ఈ మంచి మాటే చెబుతుంటారు. నిదానమే ప్రధానమని. బండి మీద వెళ్లేటప్పుడు తలకు హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని, బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలుకుతారు. ఉత్తరాఖండ్ పోలీసులు ఇంతవరకూ చెప్పటం బాగానే ఉంది. కానీ.. రోడ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కోహ్లీ మాదిరిగా డకౌట్ అవుతారని హెచ్చరించటం మాత్రం ఆయన ఫ్యాన్స్ కి అస్సలు నచ్చట్లేదు. అంతటితో ఆగకుండా కోహ్లీ ఔటయ్యాక గ్రౌండ్ ని వీడుతున్న ఫొటోని కూడా ఉత్తరాఖండ్ పోలీసులు వాడుకున్నారు. ‘‘ఇదిగో చూడండి.. ఇలాగే మీరూ అవుతారు..’’ అంటూ ట్విట్టర్ లో హిందీలో పోస్ట్ పెట్టారు.

వినూత్నం కాదు.. వైరల్..

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు తామేదో వినూత్నంగా ఆలోచించామని ఆ రాష్ట్ర పోలీసులు అనుకుంటున్నారు గానీ వాస్తవానికి వాళ్లు చేసిన పనేమీ బాగలేదు. కోహ్లీని కించపర్చినట్లు ఉంది. వైరల్ గా మారుతున్న ఈ పోస్టు పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిన్నటి మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు కోహ్లీ జీరోకే ఔట్ కావటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతుండటంలో తప్పులేదు కానీ ఉత్తరాఖండ్ పోలీసుల వ్యవహారమే తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే వాళ్లు తమకు కోహ్లీని ఇన్సల్ట్ చేసే ఉద్దేశంలేదని మనస్ఫూర్తిగా చెబుతున్నా ఆ వివరణ మాత్రం అతని అభిమానులకు నచ్చట్లేదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us