Virat: వివాదంలో కోహ్లీ.. జాతీయ గీతాలాప‌న స‌మ‌యంలో ఇలా చేస్తారా అంటూ ఫైర్

Virat: మూడు ఫార్మాట్స్ నుండి కెప్టెన్‌గా త‌ప్పుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆట‌గాడిగా రాణించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. మూడు వ‌న్డేల‌లో రెండు అర్ధ సెంచ‌రీలు చేశాడు. అయితే ఈ మ‌ధ్య వ‌రుస వివాదాల‌తో వార్త‌ల‌లోకి ఎక్కుతున్న విరాట్ తాజాగా మ‌రో వివాదంతో హాట్ టాపిక్‌గా మారాడు. దక్షిణాఫ్రికాతో జ‌రిగిన‌ చివరి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి జాతీయ గీతాలాపన చేశారు.

virat (1)
virat (1)

అయితే, ఆ సమ‌యంలో భారత ఆటగాళ్లు జాతీయ గీతం ఆల‌పిస్తుండ‌గా కోహ్లీ మాత్రం చూయింగ్‌ గమ్‌ నములుతూ గీతాలాపన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. జాతీయ గీతాలాప‌న స‌మ‌యంలో ఆయ‌న తీరు బాగోలేద‌ని, చాలా పొగ‌రుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కోహ్లీ ఇలా అనుచితంగా ప్రవర్తించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆన్ ఫీల్డ్‌లో ప్రవర్తించే తీరు ఎలా ఉన్నా ఫర్వాలేదు గానీ.. జాతీయ గీతం ఆలపించేటప్పుడు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు కోహ్లీపై ఫైరవుతున్నారు. దేశం కోసం ఆడటం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని విమర్శిస్తున్నారు.

కాగా, టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన దగ్గర నుంచి విరాట్ కోహ్లీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఆన్ ఫీల్డ్‌లో కోహ్లీ దూకుడుగా కనిపించడం లేదని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. అతడి పట్ల బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.

ఇక దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కోహ్లీ దగ్గర నుంచి వన్డే కెప్టెన్సీని లాక్కుంది బీసీసీఐ. ఇక సఫారీల చేతుల్లో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి విదితమే.