Viral: మేఘాల‌కు క‌రెంట్ షాక్.. జోరుగా కురిసిన వాన‌

Viral: కొన్ని సంఘ‌ట‌న‌ల గురించి వింటుంటే చాలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటాయి. ప్ర‌కృతిని కూడా టెక్నాల‌జీ శాసించే స్థాయికి వెళ్లిందా అనే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. తాజాగా మేఘాల‌కు క‌రెంట్ షాక్ ఇచ్చి వ‌ర్షం కురిసేలా చేశాయి. ఈ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కాగా, అస‌లు అలా ఎలా చేశారంటూ నోరెళ్ల‌పెడుతున్నారు.

దుబాయ్‌లో ఎండాకాలం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 50 డిగ్రీల‌కు పైనే ఉష్ణోగ్ర‌త ఉంది. వేడిమిని తాళలేక జనాలు నానా తంటాలు పడుతుంటారు. ఆ వేడిని తగ్గించేందుకు సైంటిస్టులు ఓ మార్గం కనుగొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని శాస్త్రవేత్తలు ఎడారి దేశానికి వర్షపాతం తెచ్చే ప్రయత్నంలో విద్యుత్తుతో మేఘాలను కొట్టడానికి కొత్త డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెటియొరాలజీ(వాతావరణ పరిశోధన కేంద్రం)లోని శాస్త్రజ్ఞులు మెరుపులతో భయపెట్టే మేఘాలకే వారు కరెంట్ షాకిచ్చారు. దీంతో.. మండువేసవిలోనూ ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి, వాతావరణం చల్లబడింది.మేఘాల‌కు క‌రెంట్ షాక్ ఇచ్చే ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఉన్న డ్రోన్స్‌కి ఆకాశంలోకి పంపి వ‌ర్షం కురిపించడం అనే కొత్త విధానం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

కరెంట్ షాకుల ద్వారా మేఘాల్లో మార్పులు జరిగి వాన కురుస్తుందట. జోరున వానలో రహదారులపై దూసుకుపోతున్న కార్ల వీడియోను మెటియొరాలజీ కేంద్రం వారు ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. క్లౌడ్ సీడింగ్” అని పిలువబడే రెయిన్‌మేకింగ్ టెక్నాలజీని వాడుకలోకి తెచ్చినట్లు ఆ దేశ మీడియా నివేదించింది. యుఏఇ వంటి పొడి దేశాలలో రెయిన్ మేకింగ్ టెక్నాలజీస్ సర్వసాధారణం అయ్యాయి. వర్షపాతాన్ని ప్రేరేపించడానికి ఎలక్ట్రికల్ ఛార్జీలను ఉపయోగించే ఈ ఆపరేషన్, కరువును తగ్గించే మార్గంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తిని తెలియజేస్తుంది.