Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండా, మ‌జాకానా.. ఆల్ఇండియా లెవ‌ల్‌లో రెండో స్థానం

Vijay Devarakonda విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల‌లోనే దేశ వ్యాప్తంగాను ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నుండి హీరో వ‌ర‌కు ఎదిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్థానం అంద‌రికి ఆద‌ర్శం. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చేసిన రిషి పాత్రతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఇక ఆ తరువాత అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి హీరోగా క్రేజ్ అందుకున్నాడు విజ‌య్. ఈ సినిమాలో విజ‌య్ న‌టన‌ను చూసి ఎవ‌రు ప్ర‌శంసించ‌లేకుండా ఉండ‌రు. అర్జున్ రెడ్డి త‌ర్వాత కూడా విజ‌య్ హీరోగా స‌త్తా చాటుతుండ‌గా, మహానటి సినిమాలో ఒక సపోర్టింగ్ పాత్రలో నటించి మళ్ళీ తానేంటో నిరూపించుకున్నాడు. యాక్టింగ్ కోసం వందశాతం హార్డ్ వర్క్ చేయగల ఈ యాక్టర్ కు అభిమానుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది.

Vijay Devarakonda

2018, 2019 సంవ‌త్స‌రాల‌లో హైద‌రాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ మ్యాన్ టైటిల్ సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ 2020 సంవ‌త్స‌రం టైటిల్ కూడా అందుకున్నారు. అంతేకాదు వ‌చ్చే ఏడాది కూడా త‌న‌కే ద‌క్కుతుంద‌నే విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు కార‌ణం విజ‌య్ న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్ అతి త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో విజ‌య్ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌డం ఖాయం. ఎంతో మంది స్టార్ హీరోల‌ను ప‌క్క‌న బెట్టి విజ‌య్ వ‌రుస‌గా మూడు సార్లు టైటిల్ అందుకోవ‌డం విశేషం.

తాజాగా ఆన్‌లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలతో టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. ఇందులో క్రికెట‌ర్స్, బాలీవుడ్ సెల‌బ్రిటీస్, ఇత‌ర రంగాల‌కు చెందిన వారిని కూడా పొందుప‌రిచింది. నేషనల్ వైడ్‌గా జరిగిన ఈ ఆన్‌లైన్ ఓటింగ్‌లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా.. రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. వీరి తర్వాత స్థానాల్లో ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ నిలిచారు. రణ్వీర్ సింగ్, వికీ కౌషల్, రణ్ బీర్ కపూర్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తర్వాత ప్లేస్‌లలో నిలిచారు. టాప్ 50లో మ‌న తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రానా ఉండ‌గా విజ‌య్ రెండో స్థానం ద‌క్కించుకోగా రానా 28వ స్థానంలో ఉన్నాడు. అయితే టాప్ సెల‌బ్స్ అంద‌రిని దాటి విజ‌య్ రెండో స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం.