Nellore: రూ.5 కోట్ల కరెన్సీ, 7 కేజీల బంగారం, 60 కిలోల వెండితో అమ్మవారికి ముస్తాబు
NQ Staff - October 12, 2021 / 09:41 AM IST

Nellore: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు. కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు.. కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు.. విద్యుద్దీప కాంతుల నడుమ అమ్మవారు అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు.

Vasavi Matha Statue Decorated with Crores of Money and Jewellery in Nellore
నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు.
మహబూబునగర్ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు.
నెల్లూరు నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేకంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. వెండి ఆభరణాలతో సీఎం జగన్ చిత్ర పటాన్ని రూపొందించారు. ఏకంగా 418 కేజీల వెండితో సీఎం జగన్ చిత్రాన్ని తయారు చేయించి తన అభిమానానికి హద్దులు లేవని నిరూపించారు.