Varisu Movie Review : విజయ్ ‘వారసుడు’ (వారిసు) రివ్యూ: అంత లేదుగానీ.!
NQ Staff - January 11, 2023 / 02:17 PM IST

Varisu Movie Review : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నేషనల్ క్రష్ రష్మిక మండన్న.. ఈ మూడు ఫ్యాక్టర్స్.. ‘వారసుడు’ సినిమాపై తెలుగునాట అంచనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం. ఆపై తమన్ సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా మారింది విడుదలకు ముందు. తమిళ హీరో విజయ్ నటించిన ఈ సినిమా కథా కమామిషు ఏంటో తెలుసుకుందాం పదండిక.!
కథేంటంటే..
ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి రాజేంద్రన్ (శరత్ కుమార్). అతనికి ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (‘కిక్’ షామ్), విజయ్ (విజయ్). తన తండ్రి విధానాలు నచ్చక, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు విజయ్. మరి, జై అలాగే అజయ్.. తన తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకున్నారా.? ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన విజయ్, కుటుంబం కోసం తిరిగొస్తాడా.? తన తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి తానే అసలు సిసలు వారసుడ్ని అని ఎలా నిరూపించుకున్నాడు.? ఈ క్రమంలో ఎదురైన సంఘర్షణ ఏంటి.? అదంతా తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు..

Varisu Movie Review
విజయ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తనదైన స్టైలిష్ యాక్టింగ్‌తో అభిమానుల్ని ఇంకోసారి మెస్మరైజ్ చేశాడు. సాధారణ సన్నివేశాల్ని సైతం అత్యద్భుతంగా మార్చేశాడు తన మార్క్ మేనరిజమ్స్‌తో. సినిమా మొత్తాన్నీ విజయ్ తన భుజాల మీద మోశాడు. ఎంటర్టైనింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్.. అన్నిటిలోనూ విజయ్ తన మార్క్ చూపించాడు.
రష్మిక మండన్న గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. మమ అనిపించిందంతే. ఆమె పాత్రని దర్శకుడు ఇంకాస్త బాగా డిజైన్ చేసి వుండాల్సింది. శరత్ కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్ తదితరులు తమ అనుభవాన్ని రంగరించారు. శ్రీకాంత్, కిక్ షామ్.. తమ పాత్రల్లో బాగానే చేశారు.
సాంకేతికవర్గం పనితీరు..
సినిమాటోగ్రఫీ చాలా బావుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. మ్యూజిక్ బావుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్ళింది. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్ విషయంలోనే ఇంకాస్త కత్తెర పదును అవసరమనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటన
తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
కొన్ని సన్నివేశాల్లో సాగతీత
కొత్తదనం లేకపోవడం
చాలా సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకురావడం
విశ్లేషణ

Varisu Movie Review
సంక్రాంతికి తెలుగు సినిమాలతో పోటీ పెట్టాడు తమిళ సినిమా ‘వారిసు’ని దిల్ రాజు. కానీ, చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ‘దిల్’ రాజు మంచి పనే చేశాడని అనుకోవాలేమో. దర్శకుడు వంశీ పైడిపల్లి, తన గత చిత్రాల ప్యాటర్న్‌ని అస్సలు మిస్ కాలేదనిపిస్తుంది. దాంతో, ‘ఆల్రెడీ చూసేశాం కదా..’ అనిపిస్తుంది కొన్ని సన్నివేశాల్ని చూసినప్పుడు. ఈ తరహా కథాంశంతో చాలా సినిమాలే గతంలో వచ్చాయి కూడా.
విజయ్ అభిమానుల్ని అలరించేందుకోసం వంశీ పడిపల్లి తీసుకున్న ప్రత్యేక జాగ్రత్తల్ని అభినందించాల్సిందే. వాటి వరకూ దర్శకుడు వంశీకి ఫుల్ మార్క్స్ పడతాయి. ఓవరాల్‌గా చూస్తే, కేవలం విజయ్ అభిమానులకే.. అన్నట్టుంది సినిమా. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఓకే అనిపిస్తాయ్.. మాస్‌ని మెప్పించే అంశాలూ లేకపోలేదు. అయినాగానీ, ఏదో వెలితి.
రేటింగ్: 2.75/5