Vaccine: ఒకే ఒక్క వ్యాక్సిన్ వేయించుకొని రూ. 7.45 కోట్లు గెలుచుకుంది..!

Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి ఉదృతి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. రెండు ద‌శ‌ల‌లో ఈ మ‌హ‌మ్మారి ప్ర‌ళ‌యం సృష్టించ‌గా, మూడో ద‌శ‌లో అంత‌కు మించి ఉంటుంద‌ని అంటున్నారు. మూడో ద‌శ‌లో డెల్లా వేరియెంట్ అతి త్వ‌ర‌గా అంద‌రికి సంక్ర‌మిస్తుందని, దీని వ‌ల‌న పిల్ల‌ల‌కు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయంటూ అమెరికా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. క‌రోనా వ్యాక్సిన్ వేయించుకుంటే కాస్త ఉదృతిని త‌గ్గించ‌వచ్చ‌ని చెబుతున్నారు.

కరోనా విజృంభిస్తున్నా కూడా కొంద‌రు వ్యాక్సిన్ అంటే భ‌య‌ప‌డుతున్నారు. ఎవ‌రెన్ని చెప్పిన కొంద‌రు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ క్ర‌మంలో కొన్ని తాయిలాలు ప్ర‌క‌టించి వ్యాక్సిన్ వేయించుకునేలా ప్రోత్స‌హిస్తున్నారు కొన్ని దేశాలు.

అమెరికాలోని ప‌లు రాష్ట్రాల‌లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు వ్యాక్సిన్ లాట‌రీ పెడుతున్నారు . కొలరాడో రాష్ట్రంలో టీకాల వైపు ఆక‌ర్షించేందుకు ఒక మిలియ‌న్ డాల‌ర్ల వ్యాక్సిన్ లాట‌రీని ప్ర‌క‌టించింది. ప్రతి వారం డ్రా నిర్వహించి విజేతకు 1 మిలియన్ డాలర్లు ఇస్తోంది. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు ఈ లాటరీకి అర్హులు.

తాజాగా తీసిన వ్యాక్సిన్ లాట‌రీ డ్రాలో మ‌హిళ‌కు అదృష్టం వ‌రించ‌డంతో సుమారు రూ. 7.45 కోట్లు గెలుచుకుంది. లక్కీ డ్రాలో హైడీ రెస్సెల్​ విజేతగా నిలవ‌డంతో రాష్ట్ర గవర్నర్​ జార్డ్​ పోలీస్ ఆమెకు 1 మిలియన్​ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.7.45కోట్లు) బ‌హుమ‌తిగా ఇచ్చారు.ఈ విషయం తెలియగానే తన ఆనందానికి అవధుల్లేవని హైడీ తెలిపింది.

త‌న‌కు డ్రాలో వ‌చ్చిన మొత్తం భ‌విష్య‌త్‌లో న‌లుగురు పిల్ల‌ల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొంది హైడీ. జూన్ నుంచి జూలై మొదటి వారం వరకు ఐదుగురు విజేతలకు కొలరాడో ఇలా తలో 1 మిలియన్ డాలర్లు ఇచ్చింది. అలాగే 12-17 ఏళ్ల వారిని టీకాలు తీసుకునేలా ప్రోత్సాహించేందుకు 50వేల డాలర్ల స్కాలర్‌షిప్స్‌ను కూడా ప్రకటించింది కొలరాడో రాష్ట్రం.

తాయిలాలు టీకా రేట్ల పెరుగుద‌ల‌కు ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌డం లేద‌ని కొల‌రాడో రాష్ట్ర డేటా చెబుతుంది. మే 26 నుంచి జూన్ 26 వరకు కేవలం 501,000 డోసుల పంపిణీ మాత్రమే జరిగింది. మొత్తంగా చూస్తే నెల రోజుల్లో వ్యాక్సినేషన్ 43 శాతం తగ్గినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.2 మిలియన్ డోసుల టీకా పంపిణీ జరిగినట్లు డేటా చూపిస్తోంది. మ‌రి డ్రాలు అని చెప్పి డ‌బ్బులు ఇస్తున్నా కూడా టీకాకి దూరంగా ఉండ‌డం ఆ ప్ర‌భుత్వాల‌ని క‌ల‌వ‌ర‌పెడుతుంది.