Uttar Pradesh : చిలుక సాక్ష్యంతో హత్య కేసు ఛేదించిన పోలీసులు
NQ Staff - March 25, 2023 / 11:15 AM IST

Uttar Pradesh : కొన్ని కేసుల్లో జంతువులను సాక్షులుగా పరిగణించడం అప్పుడప్పుడు జరుగుతుంది. జంతువుల యొక్క ప్రవర్తన ఆధారంగా అవి సూచించే సంజ్ఞల ఆధారంగా కేసులను చేదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక మహిళ హత్య కేసులో పోలీసులు చిలుక సాక్ష్యం తీసుకున్నారు.
చిలుక చెప్పిన సాక్ష్యంతో పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు.. మొదట కోర్టు చిలుక సాక్ష్యంను ఒప్పుకోలేదు.. కానీ చివరకు చిలుక సాక్ష్యం కారణంగానే నిందితులకు శిక్ష పడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2014 ఆగ్రాలో నీలం శర్మ అనే మహిళ హత్యకి గురి అయ్యింది. భర్త మరియు కుమారుడు కలిసి పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నీలం శర్మ మృతి చెంది ఉన్నారు. పెంపుడు కుక్క కూడా గాయాలతో మరణించి కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ శరీరం పై 13 కత్తిపోట్లు, కుక్క శరీరంపై 9 కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు.
సంఘటన స్థలంలో ఆధారాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు కేసు విచారణ లో జుట్టు పీక్కున్నారు. నీలం హత్య కేసులో పెంపుడు చిలక చెప్పిన సాక్ష్యంతో కీలక మలుపు తిరిగింది. అశు ఆయా తా అశు ఆయా తా అంటూ చిలుక అరవడంతో పోలీసులు ఎవరు ఆ అశు అని ఆరా తీశారు.
నీలం శర్మ మేనల్లుడు అశు అలియాస్ అశుతోష్ గోస్వామి ఆభరణాల కోసం ఆమెని హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించారు. చిలుక సాక్షానికి తొలుత కోర్టు అంగీకరించలేదు. అయితే దొంగతనం సమయంలో అశుతోష్ పై ఆమె పెంపుడు కుక్క దాడి చేసింది. అందుకు సంబంధించిన గాయాలు కూడా అశు పై ఉన్నాయి.
దాంతో పది సంవత్సరాల పాటు విచారణ జరిగి మొత్తం 14 మంది సాక్షాలు చెప్పగా చివరకు చిలుక సాక్ష్యంతో హత్య కేసు తీర్పు ఇవ్వడం జరిగింది. నగల కోసం మేనత్తను హత్య చేసిన అశు కి జీవిత ఖైదు పడింది.