TS MLC Elections : చెదిరిన ‘‘స్వప్నం’’. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్ పర్సన్ దొంగ ఓటు
Kondala Rao - March 20, 2021 / 07:08 PM IST

TS MLC Elections : గ్రాడ్యుయేషన్ చదివిన వ్యక్తులకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా ఓటు వేయటం రాలేదనే విమర్శల నేపథ్యంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. మామూలు వాళ్లు దొంగ ఓట్లు వేశారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ సాక్షాత్తూ ఒక మున్సిపల్ చైర్ పర్సన్ ఈ పని చేశారంటే ప్రతిఒక్కరికీ ఆశ్చర్యం కలుగుతోంది. బాధ్యతాయుతమైన పదవిలో నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సిన నాయకురాలు అధికారుల కళ్లు గప్పి ఇలా వ్యవహరించటం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రాజీనామా చేయాలనే డిమాండ్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ఎవరామె?.. ఏం జరిగింది?..
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మొన్న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 14న ఆదివారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ సెగ్మెంట్ కి పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో స్వప్న హైదరాబాద్ లో తన తోటికోడలి పేరుతో నమోదైన ఓటును తాను వినియోగించుకున్నారు. ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే కావటంతో పోలింగ్ సిబ్బందికి అనుమానం రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డౌటొచ్చి ఎన్నికల కమిషర్ కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ని విచారణ చేయాలని ఆదేశించారు. ఈ దర్యాప్తులో స్వప్న నిజంగానే దొంగ ఓటు వేసినట్లు తేలింది.

TS MLC Elections : tandur municipal chair person thatikonda swapna fake vote in ts mlc elections
దిగిపోవాల్సిందే: TS MLC Elections
తాటికొండ స్వప్న ఒక ప్రజాప్రతినిధి అయుండి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించటంతో ఆమె మున్సిపల్ చైర్ పర్సన్ పదవి నుంచి దిగిపోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట ఇవాళ శుక్రవారం ఆందోళన చేపట్టాయి. స్వప్న తప్పు చేసినట్లే తేలటంతో ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. బహుశా తన పదవికి రిజైన్ చేయాల్సి రావొచ్చని అనుకుంటున్నారు. స్వప్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఏదిఏమైనా ఆమె అలా చేయాల్సింది కాదు. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసి బోల్తా పడ్డారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. తాటికొండ స్వప్న టీఆరెస్ పార్టీ లీడర్ కావటం గమనార్హం.