Prashanth Reddy : పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్..! పండగ చేసుకుంటున్న వైసీపీ.!
NQ Staff - December 1, 2022 / 11:05 AM IST

Prashanth Reddy : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని మూర్ఖుడిగా అభివర్ణించారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు వరి అంటే ఏంటో తెలియదనీ, ఎన్టీయార్ వచ్చాకే తెలంగాణ ప్రజలకి వరి అన్నం తెలిసిందనీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారన్నది ప్రధాన ఆరోపణ.
పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయిన దరిమిలా, జనసేన పార్టీ స్పందిస్తుందా.? అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించేస్తున్నాయి. ఒకింత దారుణమైన భాషలోనే పవన్ కళ్యాణ్‌ని తిడుతున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్మికులు.
కానీ, అసలు విషయం వేరే వుంది..
ఇటీవల జనసేన పార్టీ మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీయార్ ప్రస్తావన తెచ్చారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఎన్టీయార్ గురించి గద్దర్ చెప్పిన మాటల్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయ్యాక రెండ్రూపాయలకే కిలో బియ్యం పథకం తెచ్చారనీ, ఈ విషయమై తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలోని ఓ వృద్ధ మహిళ, ‘ఎన్టీయార్ దయవల్లే వరి అన్నం తినగలుగుతున్నట్లు’ తనతో చెప్పిందనీ గద్దర్ వివరించిన మాటల్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.
‘జల్సా’ సినిమాలోనూ ‘పండగొచ్చినప్పుడే వరి అన్నం.. వరి అన్నం తిన్న రోజునే పండగ..’ అంటూ ఓ నిరు పేద రైతు కుటుంబం చెప్పిన డైలాగ్ వుంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.