TRS Party: ఉప్పల్ లో టిఆర్ఎస్ తిప్పల్..!?
Sravani Journalist - April 21, 2022 / 05:02 PM IST

TRS Party: పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న నియోజకవర్గం అది, అక్కడ అధికార పార్టీ టిఆర్ఎస్ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటి నుంచే కుస్తీ పడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు …!!?
ప్రస్తుతం ఉప్పల్ లో ఎమ్మెల్యే భేతి Vs మాజీ మేయర్ బొంతు..ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటం పీక్స్ లో ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ఆరాటం చాలా తొందరగా స్టార్ట్ అయ్యింది.. ఉప్పల్ కారు నేతలు ఆధిపత్యం కోసం తిప్పలు పడుతున్నారు.ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంపై పట్టు నిలుపుకునేందుకు పోటీపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

TRS Party Have Troubles in Uppal Constituency
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఎమ్మెల్యే అవమానించారని పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై బొంతు శ్రీదేవి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.నియోజకవర్గంలో మాజీ మేయర్, తాజా ఎమ్మెల్యే విడివిడిగా ఎవరికి వారు పోటీ పడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు మాజీ కార్పొరేటర్లను తెర ముందు పెట్టి.. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు మాజీ మేయర్ బొంతు.గతంలో మేయర్ గా ఉన్నసమయంలో ఒక్క ఉప్పల్ లోనే 12 వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినట్లు చెబుతున్నారు. నగరంలో అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఉప్పల్ నియోజకవర్గంలో జరిగేలా చూశానని అంటున్నారు.
తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి… ఎమ్మెల్యేలను కాదని కొందరు వ్యవహారిస్తున్నారని కేటీఆర్ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సుప్రీం కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. పార్టీ కోసం పని చేసే వాళ్ళను చేయనియ్యాలని సుతి మెత్తగా హెచ్చరించినట్లు సమాచారం.
అంతే కాదు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ పై అనేక అవినీతి ,భూకబ్జాలు చేశాడని సాక్ష్యాత్తు హై కోర్ట్ కూడా మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. భేతి సుభాష్ పై ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు కూడా అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేస్తున్నారట.

TRS Party Have Troubles in Uppal Constituency
గత కొన్ని నెలల క్రితం జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో భేతి సుభాష్ తన భార్యను కార్పొరేటర్ గా కూడా గెలిపించుకోలేకపోయాడు. హబ్సిగూడలో టిఆర్ఎస్ కాదని బీజేపీ,మరో డివిజన్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు. అప్పటినుండి భేతి సుభాష్ పై అధిష్టానం కోపంగా ఉందట.అందులోనూ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కార్పొరేటర్లపై తరచు తన ప్రతాపం చూపిస్తున్నాడని సమాచారం. ఇవన్నీ వచ్చే ఎన్నికలలో మేయర్ బొంతు రామ్మోహన్ కి కలిసొచ్చే అంశాలని భావిస్తున్నారు.
మొత్తానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుప్రీం కాదన్న రూల్ ఒక్క ఉప్పల్ కే వర్తిస్తుందా ? ఇతర నియోజకవర్గాల్లో ఇదే తరహాలో దూసుకువెళ్లే వారి పరిస్థితి పై ఎమ్మెల్యేలను టెన్షన్ కు గురిచేస్తోందట. చివరికి భేతి వర్సెస్ బొంతు వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.