Laxma Reddy: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డీ.. ఏంటీ మాటలు?..

Laxma Reddy: మాజీ మంత్రి, అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకసారి ఇలాగే ప్రజలపై తీవ్ర అసహనం ప్రదర్శించి వార్తల్లో నిలిచిన ఈయన మళ్లీ అదే తప్పు చేయటం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి నిన్న శనివారం తన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎలక్షన్ లో కారు పార్టీకి తక్కువ ఓట్లు వస్తే ఇళ్లు, నీళ్లు ఇవ్వను’’ అంటూ బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. ‘‘మాకు ఓట్లు వేయండి. మాకు ఓట్లు వేయండి అని ఎవరెవరో వచ్చి అడుగుతారు. పోతారు. కానీ మీకు ఏ పని చేసిపెట్టాలన్నా మేమే కదా. కాబట్టి మాకే ఓట్లు వేయండి. పొరపాటున వేయలేదో.. పైన చెప్పిన మాటల్నే మళ్లీ చెప్పాల్నా’’ అన్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానికులను బెదిరించారు.

చేతులు కాలాక..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బుడగజంగాల కాలనీలో శాసన సభ్యుడు లక్ష్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అనురుధ్ రెడ్డి, బీజేపీ నేషనల్ లీడర్ డి.కె.అరుణ ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. దీంతో ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘‘బుడగ జంగాల కాలనీ వాసులు నాతో మాట్లాడుతూ ఇళ్లు కావాలని అడిగితే నేను మామాలుగానే సమాధానం చెప్పాను. వాళ్లకీ నాకూ మధ్య జరిగిన మాటామంతిని కొందరు కావాలనే వక్రీకరించారు. డెవలప్మెంట్ పనులు చేసే గులాబీ పార్టీకే ఓటు వేయాలని అడిగాను’’ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

నీ సొంత డబ్బులిస్తున్నావా?..

ప్రభుత్వం చేసే మంచి పనులను జనం మర్చిపోతున్నారని, అవి గుర్తుకు రావాలంటే కొన్నాళ్లపాటు సంక్షేమ కార్యక్రమాలను నిలిపేయాలని సీఎం కేసీఆర్ కి సూచిస్తానని గతంలో ఇదే లక్ష్మారెడ్డి నోరు జారారు. ఇవాళేమో ఇళ్లు ఇవ్వను, అవి ఇవ్వను, ఇవి ఇవ్వను.. అర్థమైందా అంటూ జనాన్ని హెచ్చరించాడు. ఇంతకీ ఈ లక్ష్మారెడ్డి తన సొంత డబ్బులు ఇస్తున్నాడా అని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి లక్ష్మారెడ్డి సార్ ఇకనైనా ఇలాంటి వార్నింగ్ లకు ఎండింగ్ పలికితే బాగుంటుందని ఓటర్లు హితవు పలుకుతున్నారు. ఇలాంటి లూజ్ టాకింగులే పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని పేర్కొంటున్నారు.

https://www.facebook.com/watch/?ref=search&v=3834821279888236&external_log_id=98f3a8be-b851-4e62-9168-515b8f9cc51e&q=mla%20laxmareddy

Advertisement