BJP Vs TRS : బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.! గులాబీ నేతల్లో ఆ ‘జోష్’ ఎక్కడ.?
NQ Staff - November 19, 2022 / 05:15 PM IST

BJP Vs TRS : తెలంగాణలో బలపడేందుకు అన్ని శక్తుల్నీ కూడదీసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. కింది స్థాయి నుంచి అత్యున్నతస్థాయి వరకు.. తెలంగాణలో బీజేపీ నేతలంతా ఒక్కతాటిపై కనిపిస్తున్నారు. అంతర్గతంగా చిన్నా చితకా మనస్పర్ధలున్నాగానీ, కీలకమైన విషయాలకొచ్చేసరికి.. అంతా ఏకమై ముందుకు నడుస్తున్నారు, పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం కావొచ్చు, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో శక్తికి మించి ఫలితాల్ని సాధించడం కావొచ్చు, మునుగోడులో గెలవలేకపోయినా అధికార పార్టీకి చెమటలు పట్టించడంలో కావొచ్చు.. బీజేపీ సమిష్టి కృషి స్పస్టంగా కనిపించింది. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీయార్ ఒకింత గుస్సా అవుతున్నారు.
రోజురోజుకీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న తీరు పట్ల కేసీయార్ ఎంత గుస్సా అవుతున్నాగానీ, పార్టీ శ్రేణులు ఆ స్థాయిలో పార్టీ కోసం కష్టపడలేక పోతున్నారని, బీజేపీకి ధీటుగా బదులివ్వలేక పోతున్నారనీ.. ఆఫ్ ది రికార్డుగా గులాబీ పార్టీలోనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేయడం విషయంలో కూడా, గులాబీ పార్టీకి చెందిన నేతలు స్వచ్ఛందంగా ఘాటైన రీతిలో స్పందించింది లేదు. అధినేత ఆదేశాల మేరకు కొందరు నేతలు కొన్ని రోజులపాటు హడావిడి చేసేసి ఊరుకున్నారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో కూడా టీఆర్ఎస్ వాదనను బలంగా ఆ పార్టీ నేతలు వినిపించలేక పోతున్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీయార్ కుమార్తెను బీజేపీ లాగేందుకు ప్రయత్నించిందంటూ జరుగుతున్న రచ్చపైనా అదే నిర్లక్ష్యం గులాబీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని కేసీయార్ ఇటీవల పార్టీ వేదికపైనే ప్రస్తావించారట. ‘నా కూతురి విషయంలోనే ఇలా జరగడమేంటి.?’ అని కేసీయార్ వాపోయిన సంగతి తెలిసిందే. ‘మీమీ జిల్లాల్లో.. మీమీ నియోజకవర్గాల్లో ఒకింత ఉత్సాహంగా పని చేయండి.. బీజేపీని తిప్పి కొట్టండి..’ అంటూ సీరియస్‌గానే కేసీయార్ దిశానిర్దేశం చేశారు. అయినాగానీ, వారి వ్యవహార శైలిలో మార్పు రాలేదు.
అదే, ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టీడీపీగానీ, జనసేనగానీ ప్రశ్నిస్తే.. మొత్తంగా వైసీపీ నేతలంతా మీడియా ముందుకొచ్చి హంగామా చేసేస్తుంటారు. ఈ క్రమంలో బండ బూతులు తిట్టడానికీ వెనుకంజ వేయడంలేదు. మరి, అదే జోష్ తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎందుకు కనిపించడంలేదు.?

All BJP Leaders Are Strengthening Party In Telangana
ఈ నిస్సత్తువే మనల్ని ఓడించేయగలదు.. అని గులాబీ బాస్ కేసీయార్ హెచ్చరిస్తున్నా, గులాబీ శ్రేణుల్లో మార్పు రావడంలేదు. వాస్తవానికి, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గెలిచింది. ఆ ఫ్రస్టేషన్ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై గులాబీ శ్రేణులు దాడి చేస్తే, బీజేపీ ముఖ్య నేతలంతా అరవింద్‌కి బాసటగా నిలిచారు. కానీ, చిత్రంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కవిత ఉదంతంపై గులాబీ నేతలు చాలామంది నీరసంగా స్పందించారు. తెలంగాణలో గులాబీ పార్టీ ఖేల్ ఖతమైపోతోందా.? అందుకే టీఆర్ఎస్లో ఇంత నైరాశ్యమా.?