Train-IPL: రైలు నడవదు.. ఆట ఆగదు..

Train-IPL: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ప్రయాణాల్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రైళ్లు ఎక్కేవారు కరువవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ఇవాళ సోమవారం సాయంత్రం ప్రకటించింది. ఎల్లుండు బుధవారం నుంచి వచ్చే నెల (మే) చివరి వరకు వీటిని క్యాన్సిల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నరసాపురం-నిడదవోలు మధ్య నడిచే అప్ అండ్ డౌన్ రైలు బండ్లను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్-బీదర్, బీదర్-హైదరాబాద్ మధ్య తిరిగే ట్రైన్లు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది. సికింద్రాబాద్-కర్నూల్, మైసూర్-రేణిగుంట, సికింద్రాబాద్-ముంబై మధ్య వచ్చి పోయే రైళ్లు కూడా ఎక్కడికక్కడే ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఈ రద్దు తేదీల్ని ఒకటీ రెండు రోజులు అటూ ఇటుగా అడ్జస్ట్ చేశామని, ప్రయాణికులు గమనించాలని రిక్వెస్ట్ చేసింది.

అయినా.. ఐపీఎల్..

ఇదిలాఉండగా.. దేశం మొత్తమ్మీద కొవిడ్-19 వైరస్ పడగ విప్పినప్పటికీ, పలువురు ప్లేయర్లు టోర్నమెంట్ కి దూరం అవుతున్నప్పటికీ ఐపీఎల్ ఆగదని బీసీసీఐ ఈరోజు తేల్చిచెప్పింది. ఇంకా ఎవరైనా లీగ్ నుంచి తప్పుకోవాలనుకుంటే మంచిదేనని, ఆట మాత్రం కొనసాగుతుందని అభిప్రాయపడింది. ఐపీఎల్ 14 సీజన్ వచ్చే నెల చివరి వరకు జరగనున్న విషయం విధితమే. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కుటుంబ కారణాల వల్ల సిరీస్ నుంచి తాత్కాలికంగా వెళ్లిపోతున్నట్లు ఈరోజు ఉదయమే ప్రకటించాడు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ముగ్గురు ఎగ్జిట్ అవుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ పైవిధంగా స్పందించింది.

నేషనల్ అప్డేట్స్..

కర్ణాటకలో రేపు మంగళవారం నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు 14 రోజుల పాటు ఉంటాయని తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసర సరుకుల కొనుగోలుకు పర్మిషన్ ఉంటుందని ముఖ్యమంత్రి యడియూరప్ప చెప్పారు. దేశంలో ఆక్సీజన్ కొరతను నివారించటానికి తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణ వాయువు ఉత్పత్తి కోసం ట్యూటికోరిన్ లోని వేదాంత స్టెరిలైట్ ప్లాంట్ ని టెంపరరీగా (నాలుగు నెలల పాటు) తెరుస్తామని సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. పొల్యూషన్ పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేయటంతో ఈ పరిశ్రమను 2018లో మూసేశారు. దీన్ని ఓపెన్ చేయాలని కోరుతూ పలువురు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లగా వాళ్ల వాదనతో న్యాయస్థానం కూడా ఏకీభవించటం గమనార్హం.

Advertisement