Tollywood: స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ మొద‌లు.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం

Tollywood: కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజులు మన సినిమా షూటింగ్స్ అన్ని దాదాపు ఆగిపోయాయి. ఈ మధ్యే మళ్ళీ ఒక్కొక్కరుగా సినిమాలు మొదలు పెడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని లొకేషన్ లో అడుగు పెడుతున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికే తమ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఇప్పుడు బాలయ్య కూడా పని మొదలు పెట్టాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బాలయ్య సినిమా ఏదీ సాధించలేని రికార్డులను అఖండ కేవలం టీజర్ తోనే క్రియేట్ చేసింది. మరోవైపు బాలయ్య గత సినిమాల ఫలితాలతో పనిలేకుండా అదిరిపోయే బిజినెస్ జరుగుతుంది. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత కూడా అఖండ సినిమా కోసం బయ్యర్లు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. దానికి కారణం బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్.

ఇద్దరూ కలిసి ఇప్పటివరకు సింహా, లెజెండ్ లాంటి సంచలన సినిమాలు ఇచ్చారు. దాంతో అఖండ సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉన్నాయి. ఇందులో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వరుసగా మూడోసారి బాలయ్యతో డ్యూయల్ రోల్ కథ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెడుతున్నట్లు పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది అఖండ. మిగిలిన భాగం కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.

ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పటిలాగే అఖండ సినిమాలో కూడా ఒక పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడు బాలకృష్ణ. టీజర్ లోనే దీనిని రివీల్ చేశాడు బోయపాటి. ఇదిలా ఉంటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా త‌న తాజా చిత్రం స‌ర్కారు వారి పాట షూటింగ్ మొద‌లు పెట్టాడు. లాక్ డౌన్ త‌ర్వాత‌ ఫైన‌ల్ గా స‌ర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.

లొకేష‌న్ కి సంబంధించిన స్టిల్ విడుద‌ల కాగా, ఇందులో ఓ ఛైర్ పై మ‌హేశ్ బాబు కూర్చున్న బ్యాక్ లుక్ క‌నిపిస్తుండ‌గా..ఎదురుగా డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం ఉన్నాడు. ప‌ర‌శురాం సెట్స్ లో మ‌హేశ్ కు సీన్ వివ‌రిస్తున్న‌ట్టుగా స్టిల్ ఉంది. స‌ర్కార్ వారి పాట రీస్టార్ట్ అయిన‌ట్టు తాజాగా సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రికొద్ది రోజుల‌లో ప‌వ‌న్ కూడా త‌న తాజా చిత్రాల షూటింగ్స్ మొద‌లు పెట్ట‌నున్నాడు. స్టార్ హీరోల సినిమా షూటింగ్ మ‌ళ్లీ మొద‌లు కానుండ‌డంతో ఫ్యాన్స్ ఉత్సాహం మాములుగా లేదు.