Drugs Case: డ్ర‌గ్స్ కేసులో కీల‌క ట్విస్ట్‌.. త‌రుణ్‌,పూరీ జ‌గ‌న్నాథ్‌ల‌కు క్లీన్ చీట్

Drugs Case:దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటుడు తరుణ్‌ల‌కు పెద్ద ఊర‌ట ల‌భించింది. 2017 జులైలో పూరి, తరుణ్ నుంచి నమూనాలను ఎక్సైజ్ శాఖ సేకరించిన విషయం తెలిసిందే. స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ పేర్కొంది. సేకరించిన నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదికలో తేలింది.

పూరి, తరుణ్‌కు సంబంధించిన రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు రావడంతో 2017 జులైలో పూరి జగన్నాథ్‌, తరుణ్ నుంచి ఎక్సైజ్‌శాఖ నమూనాలు సేకరించింది. స్వచ్ఛందంగానే ఇద్దరూ రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. దీనిపై గతేడాది డిసెంబరు 8న ఎఫ్ ఎస్‌ఎల్‌ నివేదికలు సమర్పించినట్టు ఎక్సైజ్‌శాఖ తెలిపింది.

కెల్విన్‌పై ఛార్జ్‌షీట్‌తో పాటు ఎఫ్ఎస్‌ఎల్‌ నివేదిక వివరాలను కోర్టుకు సమర్పించినట్టు ఎక్సైజ్‌ అధికారులు వివరించారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వాంగ్మూలాన్ని కూడా ఎక్సైజ్‌శాఖ కోర్టుకు సమర్పించింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్ కు కోర్టు ఆదేశించింది. ఇక తరుణ్ సెప్టెంబర్ 22న ఈడీ ముందు హాజరు కావాల్సిఉండగా.. తాజాగా ఇచ్చిన క్లీన్ చిట్ తో హాజరు అవుతారా.. లేదా? అనేది తేలాల్సి వుంది.

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో భాగంగా ఈడీ స్పీడ్ పెంచిన విష‌యం తెలిసిందే. పూరి జగన్నాథ్‌తో మొదలైన ఈడీ విచారణ.. తనీష్ వరకు కొనసాగింది. బ్యాంక్ లావాదేవీలు, ముఖ్యంగా కెల్విన్‌ తో సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మనీలాండరింగ్‌, ఫెమా చట్టం ఉల్లంఘనపై ఆరా తీశారు.