Mask: అక్క‌డ మాస్క్ ధ‌రిస్తే భారీ జ‌రిమానా విధిస్తారంట‌.. అది ఎక్క‌డో తెలుసా?

Mask: ఒక‌ప్పుడు మాస్క్‌లు, శానిటైజ‌ర్స్ అనే పేర్లు ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వినేవాళ్లం. ఇప్పుడు క‌రోనా పుణ్య‌మా అని గల్లీ నుండి ఢిల్లీ వ‌ర‌కు మ‌న దేశం నుండి ఇత‌ర దేశాల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు మాస్క్‌తో పాటు శానిటైజ‌ర్ ఉప‌యోగిస్తున్నారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు పదే పదే చెబుతున్నారు. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలూ మాస్క్ తప్పనిసరి నిబంధన తీసుకొచ్చి.. జరిమానాలు కూడా విధిస్తున్నాయి. అయితే అమెరికాలో వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయ‌డంతో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో మాస్క్ ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని జో బైడెన్ ప్ర‌క‌టించారు.

ఎవ‌రు ఎన్ని చెప్పినా కూడా కొద్ది రోజులు మాస్క్ ధ‌రిస్తేనే మంచద‌ని నిపుణులు అంటున్నారు. అయితే ఓ రెస్టారెంట్ యాజ‌మాన్యం పెట్టిన నిబంధ‌న చూసి అంతా షాక్ అవుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫిడిల్‌హెడ్స్ కేఫ్‌లో రెస్టారెంట్ యజమాని.. మాస్క్ ధరించి అక్కడికి వచ్చిన కస్టమర్లకు జరిమానా విధిస్తున్నారు. రెస్టారెంట్‌లోకి మాస్క్ ధ‌రించి వ‌స్తే బిల్లుపై 5 డాల‌ర్స్ అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంద‌ని ముందుగానే క‌స్ట‌మ‌ర్స్‌కు తెలియ‌జేస్తున్నారు. ఇందుకు సంబంధించి రెస్టారెంట్ వాల్స్‌పై పోస్టర్లు కూడా అంటించారు. మ‌రోవైపు వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ప్రచారం చేసుకుంటే మరో 5 డాలర్ల ఫైన్ కూడా విధిస్తున్నారు.

మంచి చేస్తుంటే ఫైన్ విధిస్తున్నాడేంట్రా అని అంద‌రు షాక్ అవుతుండ‌గా, ఆ య‌జ‌మాని చేసే ఈ ప‌ని వెనుక మంచే ఉంది. స్వచ్ఛంద సంస్థ చారిటీ కోసమే రెస్టారెంట్ య‌జ‌మాని ఇలా చేస్తున్నాడ‌ట‌. విష‌యం తెలుసుకున్న‌ కస్టమర్లు సైతం ఫైన్ చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో రెస్టారెంట్‌లో బిల్లుపై అదనంగా 5 డాలర్లు బాగానే వసూలు అవుతున్నాయి. ప్ర‌జ‌ల‌కు సేవ అందించేందుకు కస్టమర్ల నుంచి 5 డాలర్లు ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని రెస్టారెంట్‌ యజమాని క్రిస్ స‌మ‌ర్ధించుకున్నారు. కొందరు మాత్రం అదనంగా చెల్లించడానికి నిరాకరిస్తున్నారని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.