Sagar bypoll : సాగర్ లో బిగ్ ఫైట్? గెలుపెవరిది?
Ajay G - April 15, 2021 / 10:21 PM IST

Sagar bypoll : సాగర్ లో ప్రస్తుతం ద్విముఖ పోటీ ఉంది. సాగర్ ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే. అయితే…. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ రెండు పార్టీల పాత్ర అమోఘం. ఏది ఏమైనా… సాగర్ ఉపఎన్నికను ఈ రెండు పార్టీలు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇరు పార్టీల నేతలు ప్రచార సమయం ముగిసే వారకు… జోరుగా ప్రచారం నిర్వహించారు. ఓవైపు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం.. మరోవైపు కాంగ్రెస్ నేత జానారెడ్డి.. ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? అనేదానిపై సందిగ్ధత నెలకొన్నది. జానారెడ్డి చూస్తే.. సాగర్ నియోజకవర్గంలో పేరుపేరునా తెలిసిన వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తే…. మరణించిన నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్. ఇక్కడ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? లేక ప్రజలు సీనియర్ నాయకుడు అయిన జానారెడ్డిని గెలిపిస్తారా? అనేది సస్పెన్స్ గానే ఉంది.

tight fight in sagar bypoll between trs and congress
రెండు పార్టీలు బలంగా ఉండటంతో… ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఈ రెండు పార్టీల మధ్య.. హిందుత్వ అజెండాతో వచ్చిన బీజేపీ కూడా బాగానే వ్యూహాలు రచిస్తోంది. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో… జానారెడ్డి సుమారు 7000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే… నోముల నర్సింహయ్య గెలుపునకు కారణం అయింది మాత్రం యాదవ వర్గం. వాళ్ల మద్దతుతోనే నోముల గెలిచారు. మరి… ఈసారి కూడా యాదవ సామాజిక వర్గం టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందా? లేదా? అనేది మాత్రం తేలాల్సి ఉంది. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి రెండు శాతం ఓట్లు కూడా రాలేదు. మరి… ఈ ఉపఎన్నికల్లో అయినా బీజేపీ ఓట్ల శాతాన్ని పెంచుకుంటుందా? అంటే మాత్రం తెలియదు.
కాంగ్రెస్ దశాబ్దాల పాటు పాలించి సాగర్ ను ఉద్దరించింది ఏం లేదు? అంటూ టీఆర్ఎస్ పార్టీ సాగర్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అలాగే.. సీఎం కేసీఆర్ కూడా రెండు సార్లు హాలియాలో ప్రచార సభను నిర్వహించారు. మరోవైపు అసలు టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగర్ లో ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి సవాల్ విసిరారు. ఇలా సవాల్, ప్రతిసవాల్ మధ్య… సాగర్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికలు ఈనెల 17న జరగనున్నాయి. సాగర్ ఓటరు ఎవరికి పట్టం కట్టనున్నారో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే..